రథ సప్తమి వైశిష్ట్యం


సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రథ సప్తమి అనే శ్లోకాన్ని పఠిస్తూ తల స్నానం చేయడం రథ సప్తమి నాటి సంప్రదాయాల్లో ప్రధానమైనది. ఈ రథ సప్తమి విశిష్టత ఏమిటి? ఎలా జరుపుకోవాలి? ప్రాచీన కాలం నుండి మానవుడు సూర్యుని ఆరాధిస్తున్నాడు. సూర్యుడు జ్యోతిషాధిప తి. సూర్య గమనం వలన మనకు దశ- దిశ లు తెలుస్తున్నాయి. ఉదయించే సూర్యుని కి ఎదురుగా మనం నుంచున్నప్పుడు; మన కుడి చేతి వైపు దక్షిణం, ఎడమ చేతి వైపు ఉత్తరం, వీపు వెనుక వైపు పడమర దిక్కులు వుంటాయి. సూర్యుని ప్రత్యక్ష నారాయణుడు అంటారు. కశ్యప ప్రజాపతి, అదితి ల కుమారుడే సూర్య భగవానుడు. అదితి కుమారుడు కాబట్టి సూర్యుని ఆదిత్యుడు అని కూడా అన్నారు. మాఘ మాసం శుక్ల పక్షం లో వచ్చే సప్తమి ని సూర్యుని జయంతి గా చెబుతారు. కశ్యప ప్రజాపతి ఈ సూర్యునకు రథము, సారథి, గుర్రములను ఇచ్చి లోకాధిపత్యం కల్పించిన రాజు కావున దీనిని రథ సప్తమి అంటారు అని ఒక భావన. సూర్యుని తీక్షణత ఈరోజు నుండి క్రమేణా పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం కఫరోగములను, పిత్త, బుద్ధిమాంద్యములను తొలగించే శక్తి జిల్లేడు ఆకులకు, రేగు పళ్లకు ఉంది. అందుకే ఈరోజు తలపై జిల్లేడు ఆకు దానిపై రేగు పండుని ఉంచి స్నానం చేయాలని చెబుతారు. ఆవు పిడకలను దాలిగా చేసి మండించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలు, బెల్లం, బియ్యం తో వండిన పరమాన్నం అంటే సూర్యునికి ఎంతో ప్రీతి. పంటలు చేతికొచ్చే కాలంలో వచ్చిన సప్తమి కాబట్టి ఈరోజు వండే పరమాన్నం లో కొత్త బియ్యం వాడుతారు. ఈ కాలం లో విరివిగా పాకే తీగ జాతికి చెందిన చిక్కుడు పాదునుంచి ఆకులను కోసి ఆ ఆకులపై పరమాన్నం ఉంచి సూర్యునికి నివేదిస్తారు. ఆయుర్వేద రీత్యా చిక్కుడు ఆకులు, కాయలు మన జీర్ణ వ్యవస్థపై చక్కగా పనిచేసి మంచి శక్తి ఇస్తాయి. చిక్కుడులో పీచు పదార్ధం ఉండడం వలన మంచి విరేచనకారిగా పనిచేస్తుంది. ఈ కాలం లో దొరికే చిక్కుడు తరచు తినడం వలన మలబద్ధకం సమస్యలు తొలగుతాయి. రథ సప్తమి నాడు తరిగిన కూరగాయలు తినకూడదు. చిక్కుడు కాయలతో చేసిన కూర మాత్రమే తినాలని (చిక్కుడు కాయలను తరగవలసిన పనిలేదు, చిదిపితే సరిపోతుంది) పెద్దలు చెప్పడం లో ఉద్దేశ్యం కనీసం ఈరోజైనా చిక్కుడు కాయలు తినాలి అని చెప్పడమే. చిక్కుడు కాయలతో ప్రతీకాత్మకంగా రథం చేయాలని చెప్పడం కూడా అందుకే. ఈ రోజు చేసిన పరమాన్నం సూర్యునికి నివేదించిన తరువాత అందరికీ పెట్టి, మూషికములకు కూడా రైతులు నివేదిస్తారు. ఇలా నివేదించడం వలన అవి తమ ధాన్యపు గాదెల సమీపమునకు రావు అని వారి విశ్వాసం. ఈరోజు స్వామి వారిని ఎర్రటి పుష్పములతో (ఎర్ర మందారం వంటివి ) పూజించాలి. సూర్య నమస్కారములు చేయాలి. అగస్త్యుడు శ్రీరామునికి ఉపదేశించిన ఆదిత్య హృదయం ప్రతి రోజు పారాయణ చేసేవారు ఈ రోజు 12 సార్లు పారాయణం చేయాలి. ఏ విధంగా సూర్యుడు లోకానికి ఉపయోగపడి లోక బాంధవుడు అయ్యాడో అదే విధంగా లోకానికి ఉపయోగపడే మంచి పుత్రుని ఇమ్మనమని కోరుకుంటూ ఈ రథ సప్తమి రోజు వ్రతం ఆచరిస్తారు. రథ సప్తమి రోజు ఛత్రము, పాదుకలు, ఎరుపు వస్త్రము, ఆవుపాలు, ఆవు నెయ్యి దానము చేసిన మంచిది.

- Source : Whats app Post

ముఖ్యాంశాలు