ఆ రెంటి జోలికీ వెళ్లొద్దు : ఇది రాహుల్ సిలబస్


వాట్ టూ టాక్.. వాట్ నాట్ టూ టాక్... అనే విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు సిలబస్ బోధిస్తున్నారు. ముఖ్యంగా బీఫ్‌, హిందూత్వ ఉగ్రవాదం గురించి ఎక్కడా ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని, ఆ అంశాల గురించి అసలు ప్రస్తావించ వద్దని ఆయన కర్ణాటక కాంగ్రెస్‌ నేతలను హెచ్చరించారు. సున్నితమైన ఈ అంశాలపై వ్యాఖ్యల వలన పార్టీ ప్రజల్లో బలహీనపడే అవకాశం ఉందని, దాన్ని భాజపా అనుకూలంగా మార్చుకుంటుందని ఆయన చెప్పినట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ అధికారాన్ని చేజిక్కించు కోవాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. బీఫ్‌ గురించి ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, భాజపా నేత బీఎస్‌ యడ్యూరప్ప మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ నేతలను దీనిపై గట్టిగా హెచ్చరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి అమలుపరచాల్సిన వ్యూహాల గురించి రాహుల్‌గాంధీ ఆ రాష్ట్ర సీఎం, ఇతర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అందులోనే రాహుల్ ఈ హెచ్చరిక చేసినట్లు సమావేశానికి హాజరైన ఓ నేత వెల్లడించారు. వచ్చే నెల రెండు దశల్లో కర్ణాటకలో రాహుల్‌గాంధీ ఎన్నికల ర్యాలీలు ఉంటాయి. ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు తొలి దశ పర్యటన కాగా, 21 నుంచి 23 తేదీల్లో మరోమారు రాహుల్‌ పర్యటిస్తారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచార సమయంలో మణిశంకర్‌ అయ్యర్‌ అనాలోచిత వ్యాఖ్యల వల్ల అక్కడ పార్టీ నష్టపోయిందనే భావనతోనే రాహుల్‌ ఈ ముందస్తు హెచ్చరికలు చేసినట్లు పార్టీ ప్రముఖులు చెబుతున్నారు.

ముఖ్యాంశాలు