ముఖ్యాంశాలు

విరక్తికి సైతం రక్తి కలిగించే కృష్ణ కథ!


(శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞంలో గురువారం రాత్రి ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి 21 వ ప్రసంగం ) కృష్ణ స్మరణ బతుకునే బ్రహ్మానందభరితం చేస్తుందని, విరక్తి పరులు, విరాగులలో సైతం శ్రీ కృష్ణుడి దివ్య గాధ రక్తిని కలిగిస్తుందని ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. సూర్య వంశ, చంద్రవంశజుల విషయాలు, ఎందరో భాగవతోత్తముల కథలను చెప్పావు కానీ.. నాకు పూర్తి సంతృప్తి లేదు.. ఈ కథలన్నిటి వెనుకా మెరుపులా ద్యోతకమవుతున్న ఆ తండ్రి గురించి మొత్తం చెప్పు. నేను మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడే నన్ను కాచి కాపాడాడు. మావారందరినీ అన్ని వేళలా ఉద్ధరించాడు. మా వారిని కాపాడిన వాడు.. అపార కౌరవసేనను మా పెద్దలు దునుమాడుటకు దోహదపడిన మార్గదర్శి అయిన ఆ శ్రీ కృష్ణ పరమాత్మ కథను నాకు సవిస్తరంగా తెలియజేయి గురువర్యా.. అంటూ పరీక్షిత్తు మహారాజు శుకమహర్షిని వేడుకున్నాడన్నారు. ఈ వేడుకోలు విన్న శుకుడు కరిగిపోయాడు. తనివి తీరని కృష్ణ కథామృతాన్ని వినాలంటే నిశ్చయాత్మకమైన బుద్ధి పరిపూర్ణ అర్హతను కల్పిస్తుందని తెలిపాడన్నారు. అది పరీక్షిత్ కి ఇప్పుడు వచ్చిందని శుకుడు చెప్పాడన్నారు. వాసుదేవుని కథపై నైష్టికీ రతి.. అంటే నిష్ఠతో కూడిన పరిపూర్ణ ఆసక్తి కలగాలని.. అది పరీక్షిత్తులో కలిగిందన్నారు. వాసుదేవుని కథ చెప్పాలని కోరిన వారికీ, చెప్పడానికి ఒప్పుకున్న వారికీ... చెప్పడానికి ఏర్పాట్లు చేసిన వారికీ కూడా గంగా స్నాన ఫలం లభిస్తుందన్నారు. ఇట్టి భాగ్యం ఇరవై ఒక్క రోజులు ఈ భాగవత ప్రవచనంలో కలగడం ఎంతో భాగ్యమన్నారు. చిత్త సంస్కారం ఏర్పడితే తప్ప పరీక్షిత్తుకి కూడా ఈ కథ వినే యోగ్యతా, అర్హత కలగలేదన్నారు. విన్నంత మాత్రమునే తరింపజేసే కథామృతంగా కృష్ణ చరిత్రను గ్రహించాలన్నారు. రేపటి 22 వ రోజైన శుక్రవారం కృష్ణ జనన గాధ ఉంటుందని చెబుతూ.. ఆ సందర్భంగా ఇక్కడొక మహోత్సవం జరగాలని ఆకాంక్షించారు. నంద వ్రజంలో జరిగిన మహోత్సవాలన్నీ ఇక్కడా జరగాలన్నారు. పూర్ణ బ్రహ్మావతారం, స్వయం భగవానుడు యదు వంశపు పురుషునిగా చేసిన లీలలు కృష్ణ కథ అంతా పండగే అన్నారు. కృష్ణుడు పక్కన ఉంటే బతుకంతా బ్రహ్మానందమే అని పేర్కొన్నారు. నిరంతర కృష్ణ స్మరణతో ఈ ఇరవై ఒక్క రోజులూ ప్రతిరోజూ పండగలా ప్రవచన వేదిక భాసించాలని.. నిత్యమూ కృష్ణ స్పృహతో, కృష్ణ చైతన్యంతో మైమరచి పరవశించాలని అభిలషించారు ! భాగవతం పురాణ సంప్రదాయంలో చెప్పబడి ఉంది. ఆరాధించాల్సింది భగవంతుడినైతే, ఆదర్శంగా తీసుకోవలసినది భాగవతులను... భాగవత పురుషులలో కనిపించే క్షత్రియులను జాతి కి ప్రతీకలుగా చూడరాదన్నారు. వారు ఋషుల ఉపదేశమైన ధర్మాన్ని నిలబెట్టేందుకు కృషి చేసి తరించిన వారని.. అందుకే వారి విశేషాలు చెప్పబడ్డాయని అన్నారు. వైవశ్వత మనువు నుంచే ఇక్ష్వాకు తదితరులు ఉద్భవించారని తెలిపారు. నభకుడు అనే చక్రవర్తికి నాభాగుడు అనే కుమారుడు ఉన్నాడు. అతడికి సంపదలు ఇవ్వకుండా అన్నలు మోసగించి నన్నయ నీ సంపద అని చెప్పారు. అప్పుడు అతడు తండ్రి వద్దకు వెళ్లి ఆయననే సంపదగా స్వీకరిస్తాడు. అపుడు నాభాకుడు మాట్లాడుతూ.. ఏమీ లేని నన్ను నీవు నీ సంపదగా స్వీకరించావు కాబట్టి నీకు సంపదను ఇచ్చి నీ అన్నల మాటను నిజం చేయగలనని చెప్పాడు. యాగ నిర్వహణలో సందేహగతులయ్యే అంగిరసులకు రహస్యమైన వైదిక సూక్తాలు చెబితే వారు కృతజ్ఞతతో ద్రవ్యం ఇస్తారని చెప్పి పంపాడు. అతడు అట్లే చేయగా.. అంగిరసులు యాగ అవశేష ద్రవ్యం అతడికి వదిలి వెళ్ళిపోతారు. దానిని అతడు తీసుకోబోతుండగా ఉత్తర దిశనుంచి వచ్చిన మహాపురుషుడు రుద్రుడు వారిస్తాడు. యజ్ఞ అవశేష ద్రవ్యంపై తనకే హక్కు ఉందంటాడు. అప్పుడు తండ్రి వద్దకు వెళ్లిన నాభాగుడు నిజమేనా అని అడగగా తండ్రి అవునని చెబుతాడు. అపుడు నాభాగుడు రుద్రుని చెంతకు వెళ్లి తప్పయిపోయినదని చెప్పి లెంపలు వేసుకోగా.. రుద్రుడు అనుగ్రహించి తన పాలైన ఆ ద్రవ్యాన్ని అతడికి ప్రసాదంగా అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడి సొమ్ము ఈగ కాలంత తిన్నా కోట్ల జన్మలు నరకాన పడతారు అని శాస్త్రం చెబుతున్నది కావున ఎవరూ దైవద్రవ్యానికి ఆశపడరాదని ఈ సందర్భంగా సామవేదం వారు స్పష్టం చేసారు. ఈ నాభాగుడి కొడుకు పేరు అంబరీషుడు. అతడొక మహా చక్రవర్తి. సత్పురుషుడు. సప్తద్వీప వ్యాప్తమైన భూభాగాన్ని పాలిస్తున్నాడు. అహంకార రహితంగా వైష్ణవ జీవనం పాటిస్తున్నాడు. మనో ఇంద్రియ బుధ్యాహంకారాలన్నీ స్వామిపైనే నిలిపి ఆయనకే అర్పించిన వాడు. భగవదర్పణ బుద్ధితో స్వధర్మం పాటిస్తూ రాజర్షిగా చరిస్తున్నాడు. అచ్చమైన జ్ఞానికి అంత వైకుంఠమే అని అన్నమయ్య అన్నట్టుగా ప్రతి పనీ అయన ధ్యాసతోనే చేయి. అదంతా అర్చనే. ఏది చేసిన, చూసినా, స్వీకరించినా అంతా హరిమయంగా చూసాడు. దీనివల్ల క్రమంగా లోక స్పృహ పోయి నిస్సంగత్వ స్థితికి చేరాడు. ఎవరు తన పర లేకుండా రాగద్వేషాలకు అతీతుడై శత్రువు అనే చింతన లేకుండా ఉండడం వలన పరమాత్మే రక్షిస్తాడని చెబుతుంది. విష్ణువుకి ప్రీతికరమైన ఏకాదశీ వ్రత పాలన చేస్తున్నాడు అంబరీషుడు. ఏకాదశీ వ్రతం రెండు విధాలు. శుక్లపక్ష ఏకాదశులన్నీ ఒకసారి, కృష్ణపక్ష ఏకాదశులన్నీ ఇంకొకసారి ఈ వ్రతాచరణ చేయాలి. శుక్లపక్ష విషయానికి వస్తే .. మార్గశీర్ష మాసం లో దశమి కి ఏకభక్తం, ఏకాదశి నాడు పూర్తి ఉపవాసం మరునాటి విష్ణు తిథి ద్వాదశినాడు పారణము చేస్తారు. ఇది త్రిరాత్ర వ్రతం. ఈ మాసంలో విష్ణువు నామం కేశవ.. తదుపరి పుష్యంలో కూడా ఇదే పధ్ధతి .. ఇక్కడ విష్ణువు నామం నారాయణ, తదుపరి మాసంలో నామం మాధవ. అలా ప్రతినెలా ఒక్కో విష్ణు నామంతో కార్తీకం వచ్చేసరికి దామోదరుడు వస్తాడు. ఇలా ఏడాదిపాటు చేస్తే సంవత్సర ఏకాదశీ వ్రతం పూర్తవుతుంది. ఇటువంటి ఏకాదశి వ్రతాన్ని అంబరీషుడు మధువనంలో చేసాడు. ద్వాదశినాడు మహాభక్తితో విష్ణు ఆరాధన కావించి ఇక పారణకు సిద్ధపడుతున్న సమయంలో అక్కడికి దుర్వాస మహర్షి శిష్యులతో సహా వచ్చారు, దుర్వాస మహర్షి ని ముక్కోపి అని.. విచక్షణ లేకుండా శపిస్తారని అనుకోవడం తప్పని.. నిజానికి ఆ మహర్షి దేహాత్మ భావన లేని మహా భగవదనుభవశీలి అని చెప్పారు. దత్తాత్రేయ సంప్రదాయం ఉన్నట్లే దుర్వాస సంప్రదాయం కూడా కొన్నిచోట్ల కనిపిస్తుందని సామవేదం వెల్లడించారు. అంబరీషుని భక్తి వైభవాన్ని ప్రకటించడానికే దుర్వాస మహర్షి వచ్చారన్నారు. సరిగా వ్రత ముగింపు సమయానికి వచ్చిన మహర్షిని భోజనానికి రాజు ఆహ్వానించగా.. అర్ఘ్యమిచ్చి వస్తానని చెప్పి కాళింది తీరానికి వెళ్తాడు దుర్వాసుడు. అయితే అక్కడ ధ్యాననిష్ఠలో మునిగిపోయిన ఆ తాపసి ఎంతకీ రాడు. ద్వాదశి ఘడియలు సమీపిస్తూ ఉండడంతో రాజు ద్విజులను పిలిచి తరుణోపాయం చెప్పమనగా వారు జలాన్ని స్వీకరించి వ్రతనిష్టను కాపాడుకోమని సూచిస్తారు. రాజు అలాగే చేస్తాడు. అనంతరం దుర్వాసుడు రాగా ఈ విషయం చెబుతాడు. దీనికి ఆగ్రహించిన దుర్వాసుడు ఇది ధర్మ భంగమని మండిపడతాడు. తన జతను తీసి నెలకు కొత్తగా అందులోనుంచి కృత్య అనే శక్తి ఉద్భవించి రాజును చంపడానికి వచ్చింది, ఆగ్రహానుగ్రహాలకు, శిక్షకు, రక్షకు అతీతమైన స్థితిలో చేతులు జోడించి ఉన్న భగవతోత్తముడైన అంబరీషుడు చలించలేదు. అయితే మరే చింతన లేకుండా తననే నమ్ముకున్నవారిని రక్షించడానికి భగవానుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆయన సుదర్శన చక్రం ఆ కృత్యని ఖండించి పారేసింది. అనంతరం జ్వాలలు చిమ్ముతున్న సుదర్శనం దుర్వాసునిపైకి వెళ్ళింది. భీతిల్లిన మహర్షి దానినుంచి తప్పించుకోవడానికి తిరగని లోకం లేదు. ఎక్కడికి వెళ్లినా రక్షణ దొరకలేదు. విష్ణు సంకల్పమే చక్రంగా వస్తుంటే ఆ విష్ణువు ఆధీనంలోని సర్వ జగత్తులో ఎవరు మాత్రం అడ్డుపడగలరు? విష్ణువు చంపదలిస్తే ఎవరూ కాపాడలేరని.. విష్ణువు కాపాడదలిస్తే ఎవరూ శిక్షించలేరని ఈ కథ చెవుతుందన్నారు. సుదర్శనం అంటే విష్ణువుని పొందే దారి ఏదో చూపిస్తుందని, చక్రత్తాళ్వార్ అని పిలువబడే దేవత సుదర్శనం అధిదేవత అని సామవేదం ఇక్కడ ప్రవచించారు. దుర్వాసుడు కైలాసానికి వెళ్ళగగా .. పరమశివుడు కూడా ఆ చక్రానికి నమస్కరించాడు తప్ప రక్షణ ఇవ్వలేదు. అయితే ఒక మాట మాత్రం చెప్పాడు. ఇది నారాయణ అభీష్టం గనుక నీవు వెంటనే ఆ నారాయణుడినే శరణు వేడు అని సలహా ఇచ్చాడు. ఇది విన్న వెంటనే దుర్వాసుడు వైకుంఠానికి వెళ్లి మహా విష్ణువుని ఆర్తితో ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు ఒక్కటే చెప్పాడు.. నేను భక్తదీనుడిని.. చక్రాన్ని నేను కూడా ఉపసంహరించజాలను అన్నాడు. తపస్సు విద్య ముక్తి హేతువులే గానీ.. సాధు ప్రవృత్తి లేకపోతే.. సత్పురుషులను హింసిస్తే మాత్రం అవి శోభనీయవన్నారు. నా భక్తులకు నా రక్షణ ఉంటుందని.. వారిని ఎవరూ హింసించజాలరని ఇక్కడ నారాయణుడు చెప్పాడన్నారు. నా భక్తుడైన అంబరీషుని శరణు వేడడం ఒక్కటే నీకు శరణ్యమని నారాయనుడు చెప్పగా.. దుర్వాసుడు అదే పని చేసాడు. అప్పుడు చక్రానికి నమస్కరించిన అంబరీషుడు చేసే స్తుతి సుదర్శన స్తుతి అన్నారు. సుదర్శన దేవతకు పదహారు చేతులు ఉంటాయని.. ఆ చేతుల్లో వివిధాయుధాలు ఉంటాయని.. వాటిలో చక్రం కూడా ఉంటుందని వెల్లడించారు. ఈ ఘట్టం అంబరీషుని భక్తి వైభవాన్ని, పరమాత్ముడు భక్త వాత్సల్యాన్ని, సుదర్శనం మహిమను చాటుతుంది అన్నారు. దీనిని తెలుసుకోవడం వలన సుదర్శన చక్రాయుధ అనుగ్రహం కలుగుతుందనన్నారు. కూర నారాయణ కవి రచించిన సుదర్శన శతకాన్ని ఈ సందర్భంగా గురువులు ప్రస్తావించారు. భగవానుడి ఆయుధాలన్నీ ఆయన లీలా విభూతులన్నారు. అవి భక్తుడిని రక్షిస్తాయన్నారు. విష్ణువు ప్రకారం చూస్తే.. ఆయన చేతిలోని చక్రం అగ్ని స్వరూపం.. శంఖం జల స్వరూపం అలాగే వాయు స్వరూపం, కౌముది గద భూ తత్వం, నందక ఖడ్గం ఆకాశ తత్వం అని వివరించారు. పంచభూతాలను స్వామి అధీనంలో ఉంచుకున్నాడని చెప్పడమే ఇక్కడ ఉద్దేశమని.. అలాగే స్వామి భుజానికి ధనువుగా వేలాడే శార్ఙ్గమ్ అంటే కాల తత్వమని చెప్పబడింద న్నారు. కాలానికి కూడా విష్ణువే ఈశ్వరుడు. ఆయన మెడలోని మాల మాయ అన్నారన్నారు. స్వామి ఆయుధాలంకారాలను చూసి తెలుసుకోవలసిన రహస్యంగా ఇది గ్రహించాలని తెలిపారు. సహస్రారానికి సుదర్శనాన్ని ప్రతీకగా చెబుతారని.. ఇది దాటితేనే స్వామి దర్శనం సాధ్యమన్నారు. షట్కోణములు అమరిన ఈ చక్రం సర్వాస్త్ర ఘాతమని, మహా శక్తిచ్చేదం అని తెలిపారు. మొత్తానికి దుర్వాసుడు శరణు కోరడంతో అంబరీషుని వినతి మేరకు చక్రం శాంతించింది... అంటూ అంబరీష వృత్తాంతాన్ని ముగించారు గురువులు. అనంతరం రంతిదేవుని కథను వివరించారు. ప్రపంచంలో అందరి దుఃఖాన్ని నాకు ఇచ్చేయి.. నేను అనుభవిస్తాను.. లోకంలో ఎవరూ ఆర్తితో ఉండకూడదు అని బ్రహ్మరుద్రఇంద్రాదులను అడిగాడు రంతిదేవుడు. విశ్వజనీనమైన ఆనందాన్ని కోరుకున్నాడు. కానీ పరమాత్మ ఏమి చేసాడు? ఇంతమంది రక్షణ కోరుకున్న వాడి రక్షణ తాను చూసాడు. ముక్తిని ప్రసాదించాడు. లోకం మొత్తం విష్ణుమయం అని త్రికరణశుద్ధిగా నమ్మిన వాడు గనుకనే ఇట్టి కోరిక కోరగలిగాడు.. ఇలా తరించగలిగాడు రంతిదేవుడని సామవేదం వారు తెలిపారు. ఆపైన క్లుప్తంగా ఇక్ష్వాకు ప్రభువుల కథ.. శ్రీరామ చరిత్రను తెలియజేసి ద్వాపరయుగంలో దేవకీ వసుదేవుల వద్దకు వచ్చారు.

​సంబంధిత సమాచారం 
తాజా వార్తలు

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us