ఆదియోగి విగ్రహం ఏర్పాటై ఏడాది


గత సంవత్సరం శివరాత్రి పర్వదినం నాడు కోయంబత్తూర్‌లోని వెల్లియంగిరి కొండల సమీపంలో 112 అడుగుల ఎత్తైన ఆదియోగి(శివుడు) విగ్రహము ఆవిష్కృతం అయింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్‌ ఆధ్వర్యంలోని ఈషా ఫౌండేషన్‌ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగింది. ఈ విగ్రహం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను సద్గురు వాసుదేవ్‌ తెలిపారు. భూమ్మీద ఉన్న విగ్రహాలన్నింటిలోను అతి పెద్ద ముఖం ఉన్న విగ్రహం ఇదే. అందంగా ఉండటమే కాకుండా ప్రత్యేకమైన కొలతలతో దీన్ని రూపొందించారు. విగ్రహ ముఖాన్ని స్టీల్‌తో తయారు చేశారు. ముఖాకృతి డిజైన్‌ చేసేందుకు రెండున్నర సంవత్స రాలు పట్టగా ఎనిమిది నెలల పాటు శ్రమించి దీన్ని తయారు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విగ్రహం బరువు సుమారు 500 టన్నులు ఉంటుంది. 112 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకమైన విషయం ఉంది. మనిషి తన పరిధులను అధిగమించి పరమోన్నత స్థితికి చేరుకునేందుకు శివుడు 112 మార్గాలను సూచించాడు. శాస్త్రాల ప్రకారం మానవ శరీరంలో 112 చక్రాలు ఉంటాయి. అందుకే 112 నంబరు చాలా ప్రత్యేకమని సద్గురు వాసుదేవ్‌ చెప్పారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం