రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధి మాకే ఉన్నది : సోము


ఏపీ రాష్ట్ర అభివృద్ధిపై భాజపాకి ఉన్న చిత్తశుద్ధి మరే పార్టీకి లేదని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతోంది ధర్మపోరాటమని చెబుతూ ఇందులోని వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ముఖ్యమంత్రి అనేక సందర్భాలలో కేంద్రంపై సానుకూలంగా మాట్లాడిన సందర్భాలను ఆయన గుర్తు చేశారు. హోదాతో ఒరిగేదేం లేదు, మనమే ఎక్కువ సాధించాం అని సీఎం వివిధ సందర్భాల్లో చెప్పిన వార్తా క్లిప్పింగులను సోము వీర్రాజు ప్రదర్శించారు. ఇపుడు ఆ మాటలన్నీ ఎక్కడికెళ్లాయని ప్రశ్నించారు. ప్యాకేజీకి, మోదీకి, జైట్లీకి ధన్యవాదాలు చెబుతూ సీఎం శాసనసభలో చేసిన తీర్మానం ఏమైందని అడిగారు. శాసనసభ తీర్మానానికి విలువ లేదా అని నిలదీశారు. సమన్యాయం పేరుతో విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చామని చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపింది భాజపా మాత్రమేనని..., ఆనాడు ఉండవల్లి, లగడపాటి ఏమయ్యారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తాను గానీ, తమ పార్టీ గానీ ఏమీ మాట్లాడదని స్పష్టం చేశారు. ఏపీకి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేశామని తెలిపారు. అమరావతి శంకుస్థాపన కోసం వివిధ ప్రాంతాల నుంచి సీఎం పవిత్ర మట్టి, నీరు తెప్పించారని.. ఆయన సెంటిమెంట్ గౌరవించి మోదీ పవిత్ర జలం, పార్లమెంటు నుంచి మట్టి తీసుకువస్తే తప్పు కనిపించిందా? అని సోము ప్రశ్నించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం