బొక్కు సొర చేప సంరక్షణలో గణనీయ పురోగతి


సత్ఫలితాలను ఇస్తున్న అటవీశాఖ, ఇగ్రీ ఫౌండేషన్ కృషి వేల్ షార్క్ (బొక్కు సొర చేప) సంరక్షణకు తూర్పుగోదావరి తీరంలో అటవీశాఖ, తూర్పు గోదావరి నదీ ముఖద్వార జీవ వైవిధ్య పరిరక్షణ సంస్థ (ఇగ్రీ ఫౌండేషన్) సంయుక్తంగా చేస్తున్న కృషి, తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అంతకుముందు ఐదేళ్ళలో 84 వేల్ షార్క్ చేపలు మరణించగా, గత రెండేళ్లలో ఒక్కటి మాత్రమే అటువంటి ఘటన జరిగింది. 2017 సెప్టెంబర్ 9 న కాకినాడ తీరంలో 1.5 టన్నుల బరువున్న వేల్ షార్క్ మత్స్యకారుడి వలలో పడింది.. కానీ అది మరణించడంతో ఫిషింగ్ హార్బర్ కి తరలించారు. ఈ ఒక్క ఘటన మినహా గత రెండేళ్లలో మరే వేల్ షార్క్ తూర్పు సాగర తీరంలో మరణించినట్లు నమోదు కాలేదు. జీవ వైవిధ్య రక్షణ దిశగా దీనిని ఒక గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు. అత్యంత ప్రాధాన్యం కలిగిన జీవి వేల్ షార్క్ అని ఇంగ్లిష్ లో పిలిచే అతి పెద్ద తిమింగలం జాతి చేప బొక్కుసొర. దీనిని పులి బొక్కు సొర అని కూడా అంటారు. ప్రకృతి సంరక్షణ అంతర్జాతీయ సంఘం (IUCN) ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లు గుర్తించిన ఏడు రకాల తిమింగలాల్లో ఇది ఒకటి. భారతదేశంలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం పెద్దపులితో సమానమైన ప్రాధాన్యతను ఇచ్చి బొక్కుసొర చేప సంరక్షణ చర్యలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్‌ ఒకటిలో బొక్కుసొర రక్షణ అంశాన్ని ప్రత్యేకంగా పొందుపరిచింది. బొక్కు సొరను వేటాడినా, చంపినా, విక్రయించినా, రవాణా చేసినా ఏడేళ్లు జైలుశిక్ష, రూ. 50 వేల జరిమానా విధిస్తారని అటవీశాఖ వన్యప్రాణి సంరక్షణ విభాగం డి ఎఫ్ ఓ అనంత్ శంకర్ చెప్పారు. ఐదేళ్ళలో 84 వేల్ షార్కుల మృతి... ఫసిపిక్‌ మహాసముద్రం, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతంలోకి ప్రవేశించే బొక్కుసొర చేపలు మత్య్సకారుల వలలకు చిక్కి, బోట్ల పంకాలకు తగిలి పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. కొన్నేళ్ల కిందట తూర్పు సాగర తీరంలో వేల్ షార్క్ చేపల మరణాలు అత్యంత సహజం అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఏటా 15 కి పైగా వేల్ షార్క్ ల కళేబరాలు తీరానికి కొట్టుకురావడమో, లేక మత్స్యకారుల వలల్లో చిక్కి చనిపోవడమో జరుగుతూ ఉండేది. బొక్కు సొరచేప ద్వారా వచ్చే ఆయిల్‌ను విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చనే అపోహతో కొందరు ఈ చేపను చంపేవారని నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 1889 - 1998 మధ్య 110 సంవత్సరాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ తీరంలో వలలకు చిక్కి మరణించిన వేల్ షార్క్ ల సంఖ్య 20 మాత్రమే. అయితే జూన్, 2013 నుంచి జూన్ 2018 మధ్య ఇగ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలలో మొత్తం 84 వేల్ షార్క్ చేపలు మరణించినట్లు నిర్ధారణ అయింది. దిగ్భ్రాంతి కలిగించే ఈ వాస్తవం నేపథ్యంలో అటవీశాఖ అప్రమత్తమై బొక్కుసొర చేప సంరక్షణకు ఉద్యమస్థాయిలో చర్యలు చేపట్టింది. ఈ ప్రయత్నాలు, కృషి ఫలిస్తుండడంతో రెండేళ్లుగా వీటి మరణాలు ఆగాయి. గతంలో అత్యంత అరుదుగా మాత్రమే ఇగ్రీ పరిధిలో దర్శనమిచ్చే ఈ బొక్కుసొర చేప గత రెండేళ్లుగా తరచుగా కనిపిస్తుండడమే అటవీశాఖ, ఇగ్రీ కృషి సఫలమైందనడానికి నిదర్శనం. ప్రచారం తీరిదీ... జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి బొక్కు సొర జాతి చేపలను సంరక్షించాలని అటవీశాఖ పెద్దఎత్తున ప్రచారం చేపట్టి మత్స్యకారుల్లో సదవగాహన కల్పించింది. బొక్కు సొర పరిరక్షణపై ఇగ్రీ ఫౌండేషన్ సహకారంతో అనేక అవగాహన సదస్సులు నిర్వహించారు. వివిధ గ్రామాల్లో హోర్డింగులు, కరపత్రాల రూపంలో ఇగ్రీ బొక్కుసొర సంరక్షణపై ప్రచారాన్ని నిర్వహించింది. బొక్కుసొర చేపల జీవనవిధానం, వీటి ప్రాధాన్యత పై మత్స్యకారులకు అవగాహన లేకపోవడమే గత కొన్నేళ్లలో 84 సొరచేపల మృతికి ప్రధాన కారణమని ఇగ్రీ పౌండేషన్‌ రాష్ట్ర ప్రాజెక్టు కోఅర్డినేటర్‌ రవిశంకర్‌ తూపల్లి తెలిపారు. కాకినాడ, ఉప్పాడ, తాళ్లరేవు, భైరవపాలెం, కాట్రేనికోన, సఖినేటిపల్లి వరకు విస్తరించి ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకారులకు వీటి రక్షణపై చైతన్యం, అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. సముద్ర జలాలను శుద్దిచేసి, మత్య్స సంపదను కాపాడే నైజం బొక్కు సొర చేప (వేల్‌ షార్క్‌)కు ఉందన్నారు. ఏటా ఆగస్టు 30 న అంతర్జాతీయ బొక్కు సొర చేప సంరక్షణ దినం నిర్వహించి మత్య్సకారులతో ప్రత్యేక సమావేశాలు జరిపి వారికి అవగాహన కల్పిస్తున్నామని, కళాజాతాల ద్వారా ఈ సొర చేప ప్రాధాన్యతను తెలియచేస్తూ ప్రచారం నిర్వహించామని జిల్లా అటవీ శాఖాధికారిణి డాక్టర్ నందని సలారియా అన్నారు.

బొక్కుసొర శాకాహారి.. మత్స్యకారుల ఉపకారి సముద్ర జీవరాశుల్లో అతి పెద్దదైన బొక్కుసొర చేప పూర్తి శాకాహారి. సముద్రంలోని మొక్కలను, నాచుని ఇది తింటుంది. ఈ చేపపై ఆధారపడి అనేక సాగర జీవరాశులు మనుగడ సాగిస్తాయి. మానవునికి కాకుండా ఇతర జీవులకు కూడా ఈ చేప ఎటువంటి హాని చేయదు. ఈ చేప దాదాపు 100 సంవత్సరాలు జీవిస్తుందని, 12 మీటర్ల పొడవున్న బొక్కుసొర చేప 11 మెట్రిక్‌ టన్నుల బరువు ఉంటుందని అంచనా. సముద్ర జలాలను శుద్ది చేయడమే కాక సముద్రంలో మత్య్ససంపద పెరగడానికి ఈసొర ఎంతగానో దోహద పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మత్య్సకారులు ఈ సొరను తమకు అత్యంత మిత్రునిగా భావించాలన్నారు. వేటకు వెళ్లినపుడు మత్య్సకారుల వలలో ఈ చేప చిక్కినట్లైతే వెంటనే వలను కత్తిరించి ఈ సొరచేపను సురక్షితంగా సముద్రంలోకి వదిలేసి, ఆ వీడియోని అధికారులకు ఇస్తే నష్ట పరిహారం కూడా చెల్లిస్తారు. కాకినాడలో ఒక మత్స్యకారునికి ఈ విధంగా చేసినందుకు రూ. 18 వేల పరిహారం అందజేయడం కూడా జరిగింది. బొక్కుసొర ప్రాధాన్యతపై ఇప్పుడు మత్స్యకారులకు కూడా అవగాహన పెరుగుతోంది. అయితే మర పడవలపై చేపలవేట పెద్దఎత్తున సాగుతుండడం, పారిశ్రామిక వ్యర్థాలతో పెరిగిపోతున్న కాలుష్యం, ప్రాస్టిక్ వ్యర్థాల ప్రభావం కారణంగా ఇప్పటికీ బొక్కుసొర చేపలకు ముప్పు పొంచే ఉందని ఇగ్రీ ఫౌండేషన్ కన్సర్వేషన్ బయాలజిస్ట్ ఈశ్వర్ నారాయణ అన్నారు.

ముఖ్యాంశాలు