దౌత్యాధికారులపై పాక్ జులుం

గురుద్వారాల్లోకి ప్రవేశించకుండా భారత దౌత్యాధికారులను పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో అడ్డుకున్న ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత సిబ్బందిపై పాక్ వేధింపులను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై భారత్ అధికారికంగా ఫిర్యాదు చేసింది. పాక్‌లోని భారత హైకమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న అరన్జీత్ సింగ్, సునిల్ కుమార్‌లు బుధవారం రాత్రి గురుద్వారా నాన్కానా సాహిబ్, గురువారం గురుద్వారా సచ్చా సౌధాలోకి వెళ్లడానికి రాగా అక్కడి భద్రతాసిబ్బంది వారిని అడ్డుకున్నారు. పరుష పదజాలంతో దూషించి అవమానించారు. భారత్ నుంచి వచ్చిన సిక్కు యాత్రికులను కలుసుకోవడానికి కూడా అంగీకరించలేదు. దీంతో ఈ చర్యను భారత్ ఖండించింది. ‘పాక్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రయాణ అనుమతి ఇచ్చినప్పటికీ.. భారత దౌత్యాధికారులను గురుద్వారాలకు వెళ్లకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. వారిని అవమానించారు. ఈ వేధింపులతో వారు దౌత్యపరమైన విధులు నిర్వర్తించకుండానే ఇస్లామాబాద్‌కు వెనుదిరగాల్సి వచ్చింది. అని ఓ ప్రకటనలో తెలిపింది.