డ్రాగన్ తో సరిహద్దు చర్చలు


భారత్, చైనా మధ్య 20వ దఫా సరిహద్దు చర్చలు రెండు దేశాల మధ్య పరస్పరం విశ్వాసం పెంపొందించే చర్యలే ప్రధాన ఉద్దేశంగా శుక్రవారం జరిగాయి. ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు సమస్యలను చర్చించారు. సరిహద్దు అంశంపై తుది తీర్మానానికి రాలేకపోయామని ఉభయ పక్షాలు పేర్కొన్నాయి. అయితే రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యం కోసం అనుసరించాల్సిన విధానం, చేయాల్సిన పనులపై ఆలోచనలను పంచుకున్నట్లు వెల్లడించాయి. చర్చల్లో వివాదాస్పద డోక్లాం ప్రస్తావన లేదని విశ్వసనీయ సమాచారం. రోజంతా జరిగిన ఈ భేటీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, చైనా స్టేట్‌ కౌన్సెలర్‌ యంగ్‌ జీచితోపాటు రెండు దేశాల సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. చర్చలపై చైనా విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ ‘ఇది సరిహద్దు అంశాలపై సమావేశం మాత్రమే కాదు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సమాచార మార్పిడికి సంబంధించిన కలయిక కూడా అని తెలిపారు. సమావేశం అనంతరం దోవల్, యంగ్‌ ఇద్దరూ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమ చర్చల సారాంశాన్నిఆయనకు వివరించారు. ఇండియా, చైనా మధ్య బలమైన సంబంధాలు ఇరు దేశాల ప్రజలకు ప్రయోజ నకరమని, ఇది ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా కూడా మంచి ఫలితాలను ఇస్తుందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడినట్లు భారత విదేశీ శాఖ వెల్లడించింది. అయితే డోక్లామ్ అంశం, ఇటీవల వివాదాస్పదమైన డ్రోన్ వ్యవహారం పై ఇరు దేశాలూ సంయమనం వహించాలని అంతర్గత అంగీకారం ఈ సమావేశంలో కుదిరిందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.

ముఖ్యాంశాలు