రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం

ఓ ప్రయివేటు బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి నదిలో పడిపోవడంతో రాజస్థాన్ లో 32 మంది మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సవాయ్ మధోపూర్‌లోని దుబి వద్ద శనివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన కొందరు రాజస్థాన్‌లోని రామ్‌దేవ్రా ప్రాంతానికి ఈ ప్రైవేట్ బస్సులో వెళ్తున్నారు. దుబి వద్ద బనస్ నదిపై ఉన్న వంతెనను దాటుతున్నప్పుడు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయకచర్యలు చేపట్టారు. బస్సును ఒడ్డుకు లాగించారు. ఇప్పటివరకు 27 మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.