ఆన్ లైన్ ఆర్జిత సేవ దొరికితే "లక్కీ"


తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లకు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ కి అద్భుత ప్రతిస్పందన కనిపిస్తోంది. గత మేలో తితిదే ఈ విధానం ప్రారంభించింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఏడుసార్లు ఆన్‌లైన్‌ లో టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. తాజాగా డిసెంబరు 8న 10,200 టిక్కెట్లు ఆన్ లైన్ లో కేటాయించారు. వీటి కోసం మొత్తం లక్షన్నర మంది పోటీపడ్డారు. మొదటి నెలలో జరిగిన లక్కీ డిప్ కి 8వేల మందే పోటీపడితే.. డిసెంబరు నాటికి ఆ సంఖ్య లక్షన్నరకు చేరుకుంది. అక్టోబరులో 60,166 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా నవంబరులో ఏకంగా 1,16,019 మంది పోటీపడటం అద్భుతమే. డిసెంబరులోనూ లక్షన్నర మంది పోటీపడ్డారు. సుప్రభాతం, కల్యాణోత్సవం, విశేషపూజ, సహస్ర కలాశాభిషేకం, అర్చన, తదితర సేవలకు ఆన్‌లైన్‌లో లక్కీడిప్‌ తీస్తున్నారు. ఆన్‌లైన్‌ ఒకసారి రిజిస్రేషన్‌ చేసుకుంటే ఆ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో ప్రతిసారీ లక్కీడిప్‌లో పాల్గొనవచ్చు. ఈ తేదీ, ఒక సేవ ఎంచుకున్న వారికి అవకాశం దక్కడం అరుదే. అయితే మళ్ళీ మళ్ళీ ఆర్జితసేవల్లో పాల్గొన్న వారే లక్కీ డిప్‌లో పాల్గొంటున్నారు. అక్టోబరు డిప్‌లో కొత్త యూజర్లు 40 వేలు కాగా, నవంబరులో 65,558 మంది కొత్తగా వచ్చారు. డిసెంబరులో ఈ సంఖ్య 80వేలకు చేరింది. పాత యూజర్లే మళ్ళీ మళ్ళీ వస్తే కష్టం అని భావిస్తున్న తితిదే ఇకపై దీనిని ఆధార్‌తో అనుసంధానించి, ఒకసారి లక్కీ డిప్ లో పాల్గొన్న వారు మళ్లీ రావాలంటే ఆర్నెల్ల వ్యవధి పాటించేలా చేయాలనీ చూస్తున్నది. అయితే సరైన సమాచారం సకాలంలో అందడం లేదని ఒక ఫిర్యాదు ఉంది. www.tirumala.org వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి ఆన్ లైన్ సేవలను పొందవచ్చు.

ముఖ్యాంశాలు