దేశంలోనే అతి పెద్ద రోడ్డు, రైల్ వంతెన

భారత దేశంలోనే అతి పెద్ద రోడ్డు, రైల్ వంతెన పూర్తయింది. 21 ఏళ్ళ కిందట దీని నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఇన్నాళ్లకు పూర్తయిన ఈ వంతెనను వాజ్‌పేయీ జయంతి సందర్భంగా మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌ మధ్య బ్రహ్మపుత్ర నదిపై 4.94 కిలోమీటర్ల పొడవున రూ.5,920 కోట్లతో ఈ వంతెనను నిర్మించారు. అసోంలోని తిన్‌సుకియా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని నహర్ల్‌గన్‌ పట్టణాల మధ్య దాదాపు 10 గంటల ప్రయాణ సమయం దీనితో ఆదా కానుంది. రక్షణ పరమైన అవసరాలకూ, ఈశాన్య సరిహద్దు భద్రతా దళానికి చక్కని మౌలిక వసతిగా ఉపయోగపడనుంది. వంతెన కింది భాగంలో రెండు లైన్ల రైలు పట్టాలు, పై భాగంలో మూడు లైన్ల రహదారి ఉంటాయి. ఈశాన్య సరిహద్దుకు రక్షణ సామగ్రిని తరలించే అత్యంత భారీ వాహనాలు వెళ్లేందుకు అనువుగా దీన్ని నిర్మించారు. అత్యవసరపరిస్థితుల్లో ఈ వంతెనపై యుద్ధ విమానాలను లాండింగ్ చేసే వెసులుబాటు కూడా ఉండడం విశేషం. మూడు ప్రాంతాల్లో యుద్ధ విమానాల లాండింగ్ కి ఏర్పాట్లు ఉన్నాయి. 
ఎక్కువ వర్షపాతం ఉండే ఈ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదిపై వంతెన నిర్మించడం పెద్ద సవాలు అనే చెప్పాలి. ఈ వంతెన వలన అసోంలోని డిబ్రోగఢ్‌ నగరం బిజినెస్‌ హబ్‌గా మారుతుందని, విద్యా, వైద్య తదితర రంగాలకు ఊపు రాగలదని స్థానికులు ఆశిస్తున్నారు. ఈ వంతెన నిర్మాణానికి 1997లొ అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ శంకుస్థాపన చేశారు. తర్వాత 2002లో ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నిర్మాణ పనులను ప్రారంభించారు. వివిధ కారణాలతో దీని పనులలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఈ వంతెన నిర్మాణం శంకుస్థాపన చేసిన 21 ఏళ్లకు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. 

Facebook
Twitter