ఇండోనేసియాలో పెను విధ్వంసం


అగ్నిపర్వతం బద్దలవ్వడంతో ఇండోనేసియాలో పెను విధ్వంసం చోటుచేసుకుంది. సునామీ రూపంలో ఆ దేశంపై అలలు విరుచుకుపడ్డాయి. 250 మందికి పైగా ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయినట్టు అనధికారిక సమాచారం. గాయపడిన సుమారు వెయ్యిమంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. గల్లంతయిన వారి సంఖ్య 28 గా ప్రభుత్వం చెబుతున్నా వందలాది మంది ఆచూకీ తెలియడంలేదని అనధికారిక సమాచారం. మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. వందల ఇళ్లను అలలు నేలమట్టం చేశాయి. క్రాకటోవా అనే పేరున్న అగ్నిపర్వతం గత 22 వతేదీ శనివారం రాత్రి బ్రద్దలయింది. ఆ తర్వాత నీటి లోపల భూమి కంపించి సునామీ వచ్చింది. సుమత్రా దీవి దక్షిణ తీరాన్ని, జావా పశ్చిమ ప్రాంతాన్ని రాకాసి అలలు ముంచెత్తాయి. క్షణాల్లో అక్కడి బీచ్‌లు మృత్యుదిబ్బలుగా మారాయి. వేల చెట్లను సునామీ అలలు పెకిలించాయి. సుమత్రా, జావా దీవుల మధ్య గల సుందా జలసంధి దెబ్బతింది. జావాలోని పండేగ్లాంగ్‌ జిల్లాలో అత్యధికంగా 163 మంది దుర్మరణం పాలయ్యారు. సుమత్రా దీవిలోని సౌత్‌ లాంపంగ్‌లో 48 మంది, సెరంగ్‌లో 11 మంది మృత్యువాతపడ్డారు. ప్రభుత్వ దళాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. వారాంతం కావడం, క్రిస్మస్‌ సెలవులు తోడవడంతో శనివారం బీచ్‌లలో జనం అధికంగా ఉన్నారని, ఫలితంగా మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం