రికార్డు స్థాయిలో పెట్రో ధరలు

పెట్రోలు, డీజిల్‌ ధరల పరంగా మంగళవారం రికార్డు నెలకొంది. రోజువారీ ధరలు మారుతున్న క్రమంలో లీటరుకు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్‌పై 19 పైసలు పెరిగింది. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోలు ధరలో ఇది గరిష్ఠస్థాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడమే ఈ పరిస్థితికి కారణం అన్నారు. 2018-19 బడ్జెట్‌లో ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలంటూ కేంద్ర చమురు మంత్రిత్వశాఖ ఆర్థికశాఖకు నివేదించింది. బడ్జెట్‌కు ముందు సమర్పించే తమ నివేదిక లో ఆర్థికమంత్రి పరిశీలనకు ఈ అంశం పెట్టినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై లీటరుకు రూ. 19.48, డీజిల్‌పై రూ. 15.33 వంతున ఎక్సైజ్‌ సుంకం వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తే సామాన్య ప్రజానీకంపై భారం తగ్గుతుందని అధికారులు తెలిపారు. 2014 నవంబరు - 2016 జనవరి మధ్య ఎన్డీఏ ప్రభుత్వం 9 సార్లు ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచగా గత అక్టోబరులో ఒక్కసారి (లీటరుకు రూ. 2) తగ్గించింది. దీంతో ఆ నెలలో పెట్రోలు రూ. 68.38కి, డీజిల్‌ రూ. 56.89 కి తగ్గింది. ప్రస్తుతం దిల్లీలో పెట్రోలు ధర లీటరు రూ. 72.38 చేరగా, డీజిల్‌ ధర రూ. 63.20 అయింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.76.54కు, డీజిల్‌ ధర రూ.68.56కు చేరింది. స్థానిక పన్నులు లేదా వ్యాట్‌ అధికంగా ఉన్న ముంబయిలో గత డిసెంబరు మధ్య నుంచి ఇంతవరకు పెట్రోలుపై రూ. 3.31 పెరిగి రూ. 80 మార్కును దాటింది.