పాక్ ఉగ్రస్ధావరంపై అమెరికా డ్రోన్ దాడి


ముందే చెప్పినట్టుగానే పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై అమెరికా బుధవారం డ్రోన్‌ సాయంతో దాడి చేసింది. పాకిస్తాన్‌-అప్ఘనిస్తాన్‌ సరిహద్దులో అమెరికా చేసిన దాడిలో హక్కానీ నెట్‌వర్క్‌కు చెందిన ఒక కమాండర్‌, ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు తెలిసింది. అప్ఘనిస్తాన్‌లో వేళ్లూనుకున్న తాలిబన్‌కు హక్కానీ నెట్‌వర్క్‌తో గాఢమైన సంబంధాలు ఉన్నాయి. ఫెడరల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబల్‌ ఏరియా(ఎఫ్‌ఏటీఏ)లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు సమాచారం అందడంతో అమెరికా డ్రోన్‌ దాడికి నిర్ణయించింది. అనుమానిత స్థలంపై డ్రోన్‌తో రెండు మిస్సైళ్లను వదిలారు. అప్ఘనిస్తాన్‌లో తరచూ ఉగ్ర దాడులకు పాల్పడుతున్న హక్కానీ నెట్‌వర్క్‌ను తుద ముట్టించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పట్టుదలతో ఉన్నారు. హక్కానీ కమాండర్లకు తలదాచుకోవడానికి ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్‌కు ఆర్థిక సాయాన్ని కూడా ఆయన ఇటీవల నిలిపివేశారు. కాగా అమెరికా డ్రోన్‌ దాడిని పాకిస్తాన్‌ ఖండించింది. ఇది తమ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి అని విమర్శించింది.

ముఖ్యాంశాలు