ప్రజలను ముంచుతున్న ప్రాంతీయ పార్టీలు


ఆంధ్రుల దోపిడీకి వ్యతిరేకంగా తెరాస నాయకత్వంలో అక్కడి ప్రజలు అనేక సంవత్సరాలు ఉద్యమించి తెచ్చుకున్న స్వరాజ్యఫలమే తెలంగాణ! దోపిడీ నిజమా కాదా అనేది ఇప్పుడిక చర్చనీయాంశం కాదు. అది చరిత్రలో ధ్రువపడిపోయిన సత్యం... ఎందుకూ అంటే ఆంధ్రులు తెలంగాణను దోచుకుంటున్నారని, అణచివేస్తున్నారని ఆరోపించి... ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన తెరాస గెలిచి... తెలంగాణను సాధించుకున్నది కనుక ఆ ప్రాంతం ఆంద్ర దోపిడీదారుల గుప్పిటనుంచి విముక్తం అయిందనే అర్థం. అటువంటి ఆరోపణల భారంతో... అవమానంతో మెడ పట్టి గెంటివేయబడిన ఆంధ్రులు రాజధానికి కూడా నోచుకోలేదు. అయితే ఈ దుస్థితికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల దురవస్థకు కారణం రాజకీయ నాయకులు, కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తలు.. ఇంకా సినీరంగ ప్రముఖులూ అనేది కాదనలేని నిజం. ఎందుకంటే తెలంగాణాని వ్యాపార ముడిసరుకుగా మార్చుకుని లబ్ది పొందింది వాళ్ళే.. కానీ దాని దుష్ఫలితాలు, నిందలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రాంత సామాన్య ప్రజలు, మధ్యతరగతి వర్గాల వారు అనుభవించాల్సి వచ్చింది. సరే జరిగినది ఏదో జరిగిపోయింది.. ఇకనైనా మనం మన కాళ్ళమీద నిలబడాలి అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఇదే రాజకీయ నాయకులు మరోసారి వారి స్వలాభాలకోసం కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఎక్కడైనా పార్టీ విస్తరిస్తే జాతీయ పార్టీ అవుతుంది ... కానీ మన ఆంధ్రప్రదేశ్ నాయకుల హ్రస్వ దృష్టి ఏమిటంటే .. రాష్ట్రం విడిపోయింది కాబట్టి తమవి జాతీయ పార్టీలని నమ్మడం! అలా సంతృప్తి పడడమే కాకుండా తమ ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్ లో ఏర్పాటు చేసేవారు కొందరు... ఇప్పటికీ హైదరాబాద్ పై ఆశతోనే ఉభయ రాష్ట్ర రాజకీయాలు నెరపేవారు ఇంకొందరు! రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తే తప్పేమిటి.. ఒకే పార్టీ అక్కడ ఇక్కడా ఉంటే నేరమా? అని అడగవచ్చు..! అవును ఉండొచ్చు.. అదేమీ తప్పు కాదు. కానీ అది ఎక్కడైనా సాధ్యమే కానీ ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ విషయంలో మాత్రం కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా.. ఆర్థిక స్థోమత కరవై.. ఇక్కట్లతో కొట్టుమిట్టాడుతోంది. అవమానంతో సతమతం అవుతోంది. అక్కడ తెలంగాణ మిగులు నిధులతో, విజయోల్లాసంతో ఉంది. పైగా ఆ రాష్ట్రానికి రాజధాని మాత్రమే కాకుండా ప్రత్యేకంగా తెలంగాణ కోసమే మాట్లాడే పార్టీ, ప్రభుత్వం ఉన్నాయి! మరి ఆంధ్ర ప్రదేశ్ కి? ఇక్కడ ఏ ఒక్క పార్టీ కూడా ఈ రాష్ట్రానికే పరిమితం అవ్వాలనుకోవడంలేదు. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. ఆంధ్ర తెలంగాణ మధ్య చాలా అంతరాలు, వైరుధ్యాలు ఉన్నాయి. అది ప్రజల మధ్య విరోధం కాకపోవచ్చు. కానీ విడివిడిగానే ఎదగాలనుకుంటున్న రెండు సమూహాలివి. వీటిని జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఒక గాటన కట్టాయంటే అర్థం ఉంది కానీ... తెదేపా, వైకాపా, జనసేన కూడా జాతీయ భావజాలంతో ఆలోచిస్తే ఎలా? అవి అలాగే ఆలోచించాలనుకోవడం వెనుక ఉన్న ఒకే కారణం స్వార్థం మాత్రమే. ఇరు రాష్ట్రాల్లో మాట చెల్లుబాటు కావాలి.. వీలైతే రెండు చోట్లా అధికారం వెలగబెట్టాలన్నది వారి ఆంతర్యం. ఒక జాతీయ విధానం, దృక్పథం ఉంటే దానిని జాతీయ పార్టీ అంటారు.. ప్రాంతీయ ప్రయోజనాలకు పరిమితం అయితే దానికి ప్రాంతీయ పార్టీ అని పేరు. దేశ అభ్యున్నతికి, అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా చేరడానికి ఇవి రెండూ అవసరమే. ప్రత్యేకించి ఏదైనా రాష్ట్రానికి లేదా ప్రాంతానికి మేలు చేసే ఆలోచన లేదా, జరిగిన నష్టాల్ని భర్తీ చేసుకునే ఆలోచనతో ఆవిర్భవించేవి ప్రాంతీయ పార్టీలు. అలా వచ్చినవే తెలుగుదేశం పార్టీ అయినా, తెలంగాణ రాష్ట్ర సమితి అయినా! నాడు ఆంధ్రప్రదేశ్ కి అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్నదని గర్జిస్తూ .. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో ఎన్ టి రామారావు తెదేపా ని స్థాపించారు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం, స్వపరిపాలన కోసం అంటూ పుట్టినది తెరాస పార్టీ. ఇవే కాదు పేరు ఏదైనా అసలు ప్రాంతీయ పార్టీలు పుట్టినది రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించుకునే ఉద్దేశంతో.. అదే నినాదంతో! కానీ కొన్ని పార్టీలు మైనర్ నేషనల్ లెవెల్ పార్టీల స్థాయికి విస్తరించే ప్రయత్నాలు చేయడం ద్వారా వాటి ఆత్మను, మౌలిక ఉద్దేశాలను కోల్పోతున్నాయి. స్థాపన వెనుక గల ఉద్దేశాలకు వ్యతిరేకంగా... ప్రజాప్రయోజనాలకు భిన్నంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు స్థాయిని పెంచుకొని మైనర్ నేషనల్ లెవెల్ పార్టీలు కావడం వెనుక ఆయా పార్టీల అధినేతల స్వీయ రాజకీయ ప్రయోజనాలే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. రాజకీయంగా కీలక పాత్ర పోషించాలన్న ఆయా నాయకుల తాపత్రయం, సొంత ఎజెండాలు మినహా ఇలా పార్టీని పొరుగు రాష్ట్రాలకు విస్తరించడం వలన మరో ప్రయోజనం కానరావట్లేదు. బిజెపి, కాంగ్రెస్, బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలు మినహా ఇతర పార్టీలు దేశవ్యాప్తంగా ప్రభావాన్ని, ఉనికిని చాటుకున్న సందర్భాలు ఎప్పుడూ లేవు... కానీ జాతీయ పార్టీల జాబితా మాత్రం చాంతాడంత ఉంది. కొన్ని పార్టీలకు జాతీయ అధ్యక్షుడు... వివిధ రాష్ట్రాల అధ్యక్షులు.. ఇలా కార్యవర్గాలు కూడా ఉంటున్నాయి. కానీ ఇలాంటి పార్టీలు వాస్తవానికి ప్రభావం చూపేది ఒక ప్రాంతంలో లేదా ఒక రాష్ట్రంలో మాత్రమే. మిగతా చోట్ల వీటి ఉనికి కూడా ఉండదు. అయితే కొన్ని పార్టీల నిర్వాహకులు జాతీయ పార్టీ అని చెప్పుకోవడం పెద్ద గొప్పగా ఫీల్ అవడం.. తద్వారా ఏవో ప్రయోజనాలు ఆశించి కొన్ని రాష్ట్రాల్లో.. అదీ కొన్ని స్థానాల్లో మాత్రం నామమాత్రపు పోటీకి అభ్యర్థుల్ని నిలపడం జరుగుతున్నది. వీటికి ఒక విధానం అంటూ ఉండదు. అటు జాతీయ దృక్పథమూ కాక, ఇటు ప్రాంతీయ ప్రయోజనాలకూ చెందక... తాము భ్రష్టం కావడమే కాకుండా తమను నమ్ముకున్న ప్రజలను ఈ పార్టీలు ముంచుతున్నాయి. జాతీయ పార్టీలకు ఎదురొడ్డి రాష్ట్రంలో గెలవాలంటే మాటలు కాదు. అందుచేత కొన్ని సందర్భాల్లో ఆయా జాతీయ పార్టీలతో తమ రాష్ట్రం వరకూ అవగాహన, సీట్ల సర్దుబాటు చేసుకుంటే ఎవరూ తప్పుపట్టరు. ఎందుకంటే దానివలన కేంద్రప్రభుత్వంలో చేరడం లేదా.. మద్దతిచ్చి పట్టు పెంచుకోవడం సాధ్యపడుతుంది కాబట్టి. అది మానేసి తమది కూడా జాతీయ పార్టీ అని విర్రవీగి.. తమను నమ్ముకున్న ప్రజల్ని నట్టేట ముంచుతున్నారు కొన్ని పార్టీల సారథులు. ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబునాయుడు, జగన్, పవన్ కళ్యాణ్ కూడా ఇదే గుడ్డి అభిప్రాయంతో ఉన్నారు. అటు తెలంగాణాకి, ఇటు ఆంధ్ర కి సమాన న్యాయం పేరుతో వారు రెండు చోట్లా రాజకీయ అంగళ్ళు పెట్టుకు కూర్చున్నారు. ఈ విధమైన దిగజారుడు తనం తెరాస ఎందుకు ప్రదర్శించడం లేదో వారు ఒక్కసారి ఆలోచించుకోవాలి! ఆంధ్రప్రదేశ్ పై ఈ రాజకీయ పార్టీలకు నిజంగా ప్రేమ ఉందో లేదో వారే కాదు.. ప్రజలు కూడా ఆలోచించాలి. ఒక్కటే మాట.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ ఒక్కటే మాకు అనే పార్టీలు ఏవీ కూడా ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి బాటలు వేయలేవు. కచ్చితంగా మాది ఆంధ్రప్రదేశ్ పార్టీ.. మాకు ఆంధ్రుల ప్రయోజనాలే ముఖ్యం అనే విధానమే నేటి అవసరం. అంతే తప్ప తమ రాజకీయ మనుగడ కోసం, లేదా ఆశలు అంచనాలు అందుకోవడం కోసం ఆంధ్రాలో ఒక మాట, తెలంగాణాలో ఒక మాట చెప్పే పార్టీలు ప్రజలను దగా చేస్తున్నట్టే. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఇవి. వీటిలో కొన్నిటి రిజిస్ట్రేషన్ జాతీయ అయి ఉండవచ్చు.. లేదా కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేసి ఉండొచ్చు. కానీ ఇవి తమ మూల రాష్ట్రాల్లో మూల స్వభావంతో నిలిచి ఉన్నాయి. మన పార్టీల్లా ఒకే అంశంపైనా అక్కడోమాట, ఇక్కడో మాట చెప్పడంలేదు! తమిళనాడు - అన్నా డీఎంకే, డీఎంకే ఒడిశా - బిజూ జనతాదళ్ కర్ణాటక - కేజేపీ, బిఎస్ఆర్ సిపి కేరళ - కేరళ కాంగ్రెస్ (జె),కేరళ కాంగ్రెస్ (టి) అసోం - అసోం గణపరిషద్ తెలంగాణా - తెరాస గోవా - ఎంజిపి ఛత్తీస్ గఢ్ - ఛత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ (అజిత్ జోగి) జార్ఖండ్ - జెఎంఎం, ఏ జె ఎస్ యు, జెపి, యుజెపి వగైరా మహారాష్ట్ర - మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన, శివసేన గుజరాత్ - జెడి (జి) వగైరా మణిపూర్ - మణిపూర్ పీపుల్స్ పార్టీ వగైరా నాగాలాండ్ - నాగా పీపుల్స్ ఫ్రంట్ సిక్కిం - ఎస్ డి ఎఫ్, ఎస్ ఎస్ పి, ఎస్ కె ఎం వగైరా మిజోరం - మిజో నేషనల్ ఫ్రంట్ అరుణాచల్ ప్రదేశ్ - పీపుల్స్ పార్టీ అఫ్ అరుణాచల్ హరియాణా - హరియాణా జనహిత కాగ్రెస్ పంజాబ్ - పిడిపి, ఎస్ ఏ డి

- Deekshitula Subrahmanyam, Rajamahendravaram

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us