దారి మళ్లుతున్న బ్యాంకు ఉద్యోగుల పెన్షన్ నిధులు


బ్యాంకు ఉద్యోగులు తమ కష్టార్జితంతో దాచుకున్న పెన్షన్ నిధులు దారి మళ్లుతు న్నాయి. భారత దేశ అత్యున్నత చట్టసభ దిశా నిర్దేశం చేసిన చట్టాల్ని ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడి, పెన్షన్ నిధులను ప్రైవేటు వ్యక్తులకు/ వ్యవస్థలకు "ధారాదత్తం చేస్తున్న బ్యాంకు యాజమాన్యాలు , ఉద్యోగ సంఘాల నైచ్యం ఇది. దేశంలోని బ్యాంకు ఉద్యోగుల పెన్షన్ నిధులన్నిటినీ రాజ్యాంగబద్దమైన "కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - "కాగ్ " ఆధ్వర్యంలో తనిఖీ చేయాలని ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులు కోరుకుంటున్నారు "ఆర్థిక స్వాతంత్ర్య రహిత ప్రజాస్వామ్యం అర్థ రహితం, నిరర్థకం " అన్న బాపూజీ మాటలు నాటికీ , నేటికీ , ఎన్నటికీ అక్షర సత్యం. ఆ మహాత్ముని ఆశయ సిద్ధికై బ్యాంకు ఉద్యోగులు 30-40 సంవత్సరాల పాటు భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి పాటుపడ్డారు. అలా ఎంతో సేవ చేసి రిటైరైన తర్వాత వారు తమ ఉనికిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. అటు బ్యాంకు యాజమాన్యాలు, ఇటు ఉద్యోగ సంఘాలు కూడా వాళ్ళని విస్మరించాయి. తమ కోర్కెల సాధనకై , తప్పని పరిస్థితుల్లో సుమారు దశాబ్దంన్నర కాలంగా వారు న్యాయస్థానాల్లో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ సుధీర్ఘ న్యాయ పోరాట కాలంలో ఇప్పటికే చాలామంది వయోభారంతో అసువులు బాసారు. మిగిలిన వాళ్ళలో చాలామంది కాటికి కాళ్ళు చాచుకుని శేష జీవితాన్నిభారంగా వెళ్లదీస్తున్నారు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి... పెన్షన్ నిధుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఆ నిధులు ప్రైవేటు వ్యక్తులకి, వ్యవస్థలకు ధారాదత్తం చేయబడ్డాయి. ID యాక్ట్ పరిధిలో 29 అక్టోబర్ 1993 నాడు బ్యాంకు యాజమాన్యాల సంఘం ( ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ - ఐబీఏ/ IBA) ఉద్యోగుల సంఘ సమాఖ్య (యునైటెడ్ ఫోరమ్ అఫ్ బ్యాంక్ యూనియన్స్- UFBU) ల నడుమ జరిగిన ఒప్పందం ప్రకారం బ్యాంకు ఉద్యోగుల "పెన్షన్ రెగ్యులేషన్స్ -1995" అను చట్టం భారత అత్యు న్నత చట్టసభ (పార్లమెంట్) ఆమోదించింది. భారతీయ రిజర్వు బాంక్ లో అమలులోవున్న విధంగా ఈ చట్టం రూపొందించబడినది. పార్లమెంట్ చట్ట పరిధిలో వున్న ఈ పెన్షన్ రెగ్యులేషన్స్ అన్ని బ్యాంకుల్లో అమలు చేయబడ్డాయి . పార్లమెంటుకి తెలియకుండా వీటిని సవరించే హక్కు గానీ , అధిగమించి వ్యవహరించే అధికారం గానీ ఎవ్వరికి లేదు. కానీ , పార్లమెంట్ చట్ట పరిధిలో వున్న పెన్షన్ రెగ్యులేషన్స్ ని సైతం లెక్కచేయకుండా ఐబీఏ/ IBA ఉద్యోగ సంఘాలతో చట్ట విరుద్ధంగా ఒప్పందాలు చేసుకుని వాటిని రాజ్యాంగ విరుద్ధంగా అమలు చేయడానికి సూచనలు చేస్తోంది. బ్యాంకులు వాటిని పాటిస్తున్నాయి. తద్వారా విశ్రాంత ఉద్యోగుల్లో విభజన సృష్టిస్తూవుంది. బ్యాంకు ఉద్యోగుల పెన్షన్ నిధి - నిర్వహణ : పార్లమెంట్ ఆమోదించిన పెన్షన్ రెగ్యులేషన్స్ ప్రకారం బ్యాంకులు తమ ఉద్యోగుల జీతాలనుంచి ప్రతినెలా కొంత శాంతం మొత్తం వారి వారి ప్రోవిడెంట్ ఖాతాల్లో జమ చేస్తాయి. ఉద్యోగుల ముందస్తు అనుమతితో బ్యాంకులు తమ సమాన వాటా మొత్తాన్ని మాత్రం "ఎంప్లాయిస్ పెన్షన్ ట్రస్ట్ నిధి" కి జమ చేస్తాయి. మేనేజిమెంట్ నుంచి , గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నించి కొంత మందితో కూడిన "ట్రస్ట్ బోర్డు " ను నియమిస్తుంది ఈ విధంగా ఏర్పడ్డ నిధి లో కొంత భాగం "ట్రస్ట్ బోర్డు " ఎప్పటికప్పుడు "గవర్నమెంట్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ " లో పెట్టుబడి పెడుతూ తద్వారా వచ్ఛే రాబడి తో విశ్రాంతి పొందిన ఉద్యోగులకి పెన్షన్ రూపేణా ప్రతి నెల చెల్లింపులు చేస్తుంది . ప్రతి సంవత్సరం జమ , ఖర్చులు , అంచనాలు వేయడం , ఎప్పటికప్పుడు పెట్టుబడుల నిర్వహణ భాద్యత మొదలైన అంశాలన్నీ "ట్రస్ట్ బోర్డు " పరిధిలోకే వస్తాయి. కానీ కొన్ని బ్యాంకులు /ట్రస్ట్ బోర్డ్స్ పాల్పడిన వివిధ అవకతవకలు/ నేరారోపణలు ఈ మధ్యనే వెలుగులోకి వచ్చాయి. వాటికీ ఉదాహరణలు ఇలా ఉన్నాయి. 01. బ్యాంకులు తమ వాటా మూలధనం సకాలంలో పెన్షన్ నిధికి జమ చెయ్యకపోవడం 02. నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టడం 03. వడ్డీ నష్ట పరిహారం చెల్లించక పోవడం 04. నిబంధనలకు వ్యతిరేకంగా పెన్షన్ ట్రస్ట్ నిధుల్ని "దారి మళ్లించడం " ఇవన్నీ నిధుల దుర్వినియోగం కిందికే వస్తాయి. ఉదాహరణకి పైన చెప్పిన "నిధుల దుర్వినియోగం " తమ దైనందిన విధి నిర్వహణలో ఏ బ్యాంకు ఉద్యోగయినా పాల్పడి ఉంటే తక్షణమే చర్య తీసుకుని ఉద్యోగం నుంచి డిస్మిస్ చెయ్యడమే కాక , క్రిమినల్ నేరం కింద జైల్లో మగ్గాలి. అలాంటప్పుడు , అదే నేరం చేసినందుకు బ్యాంకు పెన్షన్ ట్రస్ట్ నిర్వాహకులు (ట్రస్ట్ బోర్డు మెంబర్లు ), సంబంధిత అధికార్లందరూ కూడా శిక్షార్హులే కదా! ప్రతి బ్యాంకు బోర్డు లోను రిజర్వు బ్యాంకు అధికారులు, ఆర్థిక మంత్రిత్వ శాఖాధికారులు ప్రాతినిధ్యం వహిస్తారు. బ్యాంకు బోర్డు ప్రతిపాదిత కమిటీలలో ముఖ్య మైన "ఆడిట్ కమిటీ" కి కూడా నేతృత్వం వహిస్తారు. దీనికి తోడు ప్రతిసంవత్సరం, ఆర్ బి ఐ చే నియమింపబడిన ఆడిటర్లు కూడా వుంటారు. మరి వీళ్ళందరూ కూడా "శిక్షార్హులే " మచ్చుకి కొన్ని ఉదంతాలు : 01. ఆల్ ఇండియా బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సమాఖ్య (ఇండోర్ ) వారు తమ చార్టర్ అఫ్ డిమాండ్స్ లో (# 2017/67/15 06 2017- పేజీ: 10 & 11) భాగంగా "కాగ్ అడిట్ " కోసం అభ్యర్ధించారు 02. బ్యాంకు నష్టాలు పూడ్చే ప్రయత్నంలో భాగంగా - పంజాబ్ నేషనల్ బ్యాంకు లో పెద్దమొత్తంలో పెన్షన్ నిధులు దారి మళ్లించారు ( Lr . dtd. 14 09 217 to ఆర్బీఐ గవర్నర్ ) 03. అటువంటి మరో ఉదంతం ఓరియంటల్ బ్యాంకు అఫ్ కామర్స్ లో (Lr . dated 23.12. 2016 & 28 08 2017 addressed to శ్రీ ఉర్జిత్ పటేల్ , ఆర్బీఐ గవర్నర్) 04. మరీ ముఖ్యంగా తెలుపవలసిన "ఘాతుకమైన ఉదంతం " ఏమిటంటే సాక్షాత్తూ అఖిల భారతీయ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ముఖ్య కార్యదర్శి జారీ చేసిన "అంతర్గత సర్కులర్" (ref. No.28/34/2017/34 dated 24 09 2017) ద్వారా వెలుగులోకి వఛ్చిన సమాచార ప్రకారం - ఒక బ్యాంకు తమ ఉద్యోగుల పెన్షన్ నిధుల్ని "ప్రైవేట్ వ్యక్తులకి /సంస్థలకి " దారి మళ్లించింది. దీనికి తోడు షుమారు రూ.14,000/ కోట్ల భారీ ఋణం కూడా ఆ ప్రైవేట్ సంస్థ కి సమర్పించారు . ఇఛ్చిన భారీ ఋణం "మొండి బకాయి " అయి కూర్చుంది రిజర్వు బ్యాంకు వారి సాక్షిగా. దివాళా తీసిన సదరు కంపెనీలో "ఎన్ సి డి " రూపం లో "పెట్టుబడిదారులైన " ఉద్యోగుల పెన్షన్ నిధులు - అసలు వడ్డీ తో సహా గల్లంతయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ ఒక్క ఉదంతమే నా వాదానికి పెద్ద వూతం. ఇంతకన్నా దారుణం ఏమైనా వుందా ? బ్యాంకు ఉద్యోగుల కష్టార్జితం సొమ్ములు కూడా దోచుకునే "దొరకని దొరలకి " శిక్షలు లేవా? ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల పై నమ్మకం ఉంటుందా సామాన్య ప్రజానీకానికి ? అదే జరిగితే భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాదా ? అందుకే ప్రభుత్వం తక్షణం స్పందించి రాజ్యాంగ బద్దమైన "CAG Audit " కి ఆదేశించమని ఈ వ్యాసం ద్వారా అభ్యర్థిస్తున్నాను. - -దేవులపల్లి శ్రీనివాస మూర్తి

ముఖ్యాంశాలు