కాషాయమంటే కంటగింపేలా?


కాషాయం.. ఈ ప‌దం విన‌గానే కొంద‌రు వ్య‌క్తులు గంగ‌వెర్రులెత్తిపోతున్నారు.. ఇదేమో బీజేపీ, ఆరెస్సెస్‌ల ట్రేడ్ మార్క్ అన్న‌ట్లుగా భ‌య‌ప‌డిపోతూ దూరం దూరం అంటున్నారు. ఈ సంస్థ‌లు పుట్ట‌క ముందే వేలాది సంవ‌త్స‌రాలుగా కాషాయం ఉంది. అది ఒక మ‌త చిహ్నం మాత్ర‌మే అనుకుంటే అంత‌క‌న్నా అజ్ఞానం మ‌రొక‌టి ఉండ‌దు. స‌నాత‌న ధ‌ర్మం, సంస్కృతిక వార‌స‌త్వంతో ముడిప‌డిన కాషాయం రంగు త్యాగానికి ప్ర‌తీక‌.. దేశ సంస్కృతి, చ‌రిత్ర మీద ఏమాత్రం అవ‌గాహ‌న లేనివారు, సంకుచిత రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం పాకులాడే వారు, కొన్ని విచ్చిన్న‌ర‌క‌ర శ‌క్తులు ఈ త‌ర‌హా ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. కొత్త‌గా రాజ‌కీయ పార్టీ పెట్టిన న‌టుడు కాషాయం అంటేనే ఉలిక్కి ప‌డుతున్నాడు. ఏకంగా జాతీయ ప‌తాకంలోని కాషాయం రంగు విస్త‌రించ వ‌ద్దంటున్నాడు. ఈయ‌న‌కు అస‌లు జాతీయ ప‌తాకం, రాజ్యాంగ‌ప‌ట్ల ఏమాత్రం అవ‌గాహ‌న లేదు అన‌డం క‌న్నాకొన్ని శ‌క్తులు ఆయ‌న‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయి అన‌డం స‌మంజ‌సం. జాతీయ ప‌తాకంలోని మూడు రంగులు మ‌తాల‌కు ప్ర‌తీక‌గా భావించేవారిని చూసి వారి తెలివి త‌క్కువ‌త‌నానికి జాలి ప‌డ‌టం మిన‌హా మ‌రేం చేయ‌లేం.. భార‌త తొలి ఉప రాష్ట్ర‌ప‌తి డాక్ట‌ర్ స‌ర్వేప‌లి రాధాకృష్ణ‌న్ ఉల్లేఖ‌నం ప్ర‌కారం.. "కాషాయరంగు త్యాగానికి గుర్తు. ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది. తెలుపురంగు మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తు. ఆకుపచ్చరంగు మట్టితో మనకున్న అనుబంధానికి, ఇతరజీవులన్నీ ఏ వృక్షసంపదమీద ఆధారపడి ఉన్నాయో ఆ పచ్చని చెట్లకు గుర్తు. అశోకచక్రం ధర్మపాలనకు గుర్తు. సత్యం, ధర్మం అనేవి ఈ పతాకం క్రింద పనిచేసే ప్రతి ఒక్కరి నియమాలు కావాలి. పైగా చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. జీవమున్న ప్రతిచోటా చైతన్యముంటుంది. చైతన్యం లేనిది చావులోనే. భారతదేశం ఇక మీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలి. చక్రం శాంతియుతమైన, చైతన్యవంతమైన ప్రగతికి చిహ్నం." (మ‌రిన్ని వివ‌రాల‌కు చూడండి: http://india.gov.in/knowindia/national_flag.php) కాషాయం స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతకు; తెలుపు శాంతికి, సత్యానికి; ఆకుపచ్చ సాఫల్యతకు, సస్యసమృద్ధికి చిహ్నాలనే ఒక అనధికారిక అన్వయం కూడా బాగా ప్రచారంలో ఉంది. ఇప్ప‌టికైనా కాషాయం రంగును అవ‌మానించ‌డం మానుకోండి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం