అడవి ... మానవులపై దాని ప్రభావం


పూర్వకాలంలో తెగలు ఉండేవి. అప్పట్లో ఒక తెగ నాయకుని లేదా రాజు యొక్క సంపదని తెలియజేయడానికి “అడవి” అన్న పదం వాడేవారు. రాజులు మరియు రాజ్యాల ప్రాభవం తగ్గిపోయాక అడవికి ఉన్న ఈ పాత అర్థం మారిపోయింది. ఇప్పుడు సహజ పరిస్థితులలో వృక్షాల తో ఆవరించబడ్డ భూమిని అడవి అని పిలుస్తారు. వనం, అరణ్యం దీనికి పర్యాయపదాలు. ఇవి ప్రయరీలు,మైదానప్రాంతాలు, గడ్డి భూముల కంటే భిన్నమైనవి. ఐతే ప్రస్తుత భావనలో అడవి అంటే స్వాభావికంగా నైనా మానవులచేతనైనా పెరిగిన లేదా పెంచబడిన ఆర్థిక జీవ సంబంధ ప్రాముఖ్యమైన మొక్కలుకలది. ఇక్కడ ఉత్పన్నమయ్యే కలప ఇతర పదార్థాలు ఆర్థిక ప్రాముఖ్యత కలిగినవి. అరణ్యంలోని చెట్ల మద్య సంబంధం, నేలకోత నుండి రక్షణ మరియు వాతావరణం పై ప్రభావం ఇవన్నీ జీవసంబంధమైనవి. అడవి-మానవులు ఆదిమానవుని కాలం నుండి అడవులు మానవునిపై చాలా విధాలుగా ప్రభావాన్ని చూపాయి. ఈ భూమి పై మానవుడు వ్యాప్తి చెందడానికి అడవులు కూడా ఒక ముఖ్య కారణం కావచ్చును. అడవుల్లో లేదా అడవులకి దగ్గరగా జీవించే ఆదిమజాతులవారి ఆధ్యాత్మిక మరియు మత సంబంధ జీవితాన్ని అడవులు ఎంతో ప్రభావితం చేస్తాయి. మానవులు ఆర్థికంగా అభివృధ్ధి చెందడానికి లేదా మనుగడ సాధించడానికి అడవులలో లభించే ముడిపదార్థాలు కీలకం. అడవులు ఇంధనానికి ఒక ముఖ్య వనరుగా ఉండి మానవుల ప్రగతిపై చాలా ప్రభావాన్ని చూపాయి. మానవుడు ఎన్నో రకాల అడవి ఉత్పత్తులను ఉపయోగించుకొంటున్నాడు. ఈ జాబితాలో మొదటిది కలప, రెండవది ఆహారం. అవసరానికి మించి విస్తారంగా వీటిని ఉపయోగించడం వలన ప్రస్తుతం అడవులు అంతరించిపోయే దశకు వచ్చాయి.

అడవుల సంరక్షణ వేగంగా అంతరించి పోతున్న అడవుల విస్తీర్ణాన్ని మరియు అడవుల ఉనికిని సంరక్షించడం తక్షాణావసరం. జాతీయస్థాయిలో ఈ దిశగా పలు చర్యలు చేపట్టారు. సమాజంలోని ప్రతి భాద్యతగల వ్యక్తి వనసంరక్షణకు దోహదం చేసే వివిధ కృత్యాలను స్వచ్చందంగా నిర్వహించవచ్చు. ఉదాహరణకు చెట్లకొట్టడాన్ని, వేర్లతొ పాటు పెకలించడాన్ని నిరోధించవచ్చు, ముఖ్యంగా వేగంగా పెరిగే మొక్కలను, ఎప్పుడు వీలైతే అప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ నాటవచ్చు. పురుగు మందులను సరైన పద్దతులలో, తగుమేరకు మాత్రమే ఉపయోగించడం, కాలుష్యాన్ని తగ్గించడం, మొక్కలలో వ్యాధుల వ్యాప్తిని నిరోధించడం మొదలైనవి చెయ్యవచ్చు. భావిభారత పౌరులైన విద్యార్ఠులకు ప్రాథమికదశలోనే ఈ ఆలోచనలను చొప్పించడానికి కృషి జరగాలి. “conservation patch” లేదా సంరక్షణ ప్యాచ్ అనే భావనను ప్రతి వ్యక్తీ సులభంగా ఇంటి దగ్గర గానీ పాఠశాలలోకానీ అమలు చెయ్యవచ్చు. సంరక్షణ ప్యాచ్ అంటే వన్యప్రాణులను గురించి అధ్యయనం చేసే స్థలం. ఇంటి ఆవరణలో, కార్యాలయాల ప్రాంగణంలో, పాఠశాల స్థలాల్లో వివిధరకాల కీటకాలను, సీతాకోకచిలుకలను, తాబేలు మరియు గూడులు కట్టి గుడ్లను పెట్టే జంతువులను ఆహ్వానించే విధంగా మొక్కలను పెంచాలి. చిన్న బోరేజ్ మొక్కలు ఇంటి దగ్గర లేదా పాఠశాల దగ్గర సులభంగా నాటవచ్చు. ఇవి ఈగలను/సీతాకోకచిలుకలను ఆకర్షిస్తాయి. ప్రకాశవంతమైన రంగులు గల స్ట్రాల కట్టను కిటీకి దగ్గర ఉంచితే అవి కందిరీగలు గూడు కట్టుకొనేలా లోపలికి ఆకర్షిస్తాయి. ఖాళీ స్థలాల పరిసరాల్లో పెద్దరాళ్ళ కింద కొద్దికాలం తరువాత వెన్నెముక లేని ప్రాణులను (ఉదాహరణకు తేలు మొదలైనవి) చూడవచ్చు. పగిలిపోయిన పూలకుండీలను కొంత చీకటి ప్రదేశంలో వదలి వేస్తే అవి నత్తలకు విశ్రాంతి ప్రదేశం అవుతుంది. స్ఠలం అందుబాటులో ఉంటే ఒక వెడల్పుమూతి కలిగిన ప్లాస్టిక్ పెద్దగిన్నెను నీటితో నింపి ఉంచితే అక్కడ పక్షులు స్నానం కోసం వరుసలో నిలబడడం మనకు ఆనందాన్నిస్తుంది. ఇంకా ఉడుతల కోసం, కుందేళ్ళ కోసం ఇంటి వంటి నిర్మాణాలను (గూళ్ళు) నిర్మించవచ్చు.