ప్రముఖ సినీ నటి శ్రీదేవి అస్తమయం

అందం, అభినయంతో సినీ ప్రేక్షక లోకాన్ని దశాబ్దాలపాటు అలరించిన ప్రముఖ సినీ నటి శ్రీదేవి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుబాయ్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఓ వివాహ వేడుకకు హాజరైన ఆమె అక్కడ గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారని సంజయ్ కపూర్ (మరిది) ద్రువీకరించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రసీమలను కొన్నేళ్లు ఆమె హీరోయిన్ గా ఏలారు. తమిళనాడులోని శివకాశిలో ఆగస్టు 13న శ్రీదేవి జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్. 1967లో బాలనటిగా ‘కన్దన్ కరుణాయ్’ తమిళ చిత్రం ద్వారా మొదటిసారి వెండితెరపై కనిపించారు. 1976లో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మాండ్రు ముడిచు’లో కమల్ హాసన్, రజనీకాంత్‌లతో కలిసి నటించి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ‘పదహారేళ్ల వయసు’, హిందీలో ‘సోల్వా సావన్’.. హీరోయిన్గా ఆమెకు తొలి చిత్రాలు. 1975-85 మధ్యకాలంలో తెలుగు, తమిళంలో ఆమె నెంబర్ వన్ కథానాయిక కాగా ఎన్ టి ఆర్, నాగేశ్వర్రావు, శోభన్ బాబు, కృష్ణ తదితర హీరోలందరితో చిత్రాలు చేసారు. ఆ తర్వాత కమల్, రజనీకాంత్, చిరంజీవి, నాగార్జునతో కూడా సినిమాలు చేసి రెండు తరాల హీరోలతో నటించిన హీరోయిన్గా ఆమె పేరు తెచ్చుకున్నారు. దక్షిణాది తర్వాత ఆమె ప్రస్థానం ఉత్తరాదికి చేరింది. అనేక హిందీ చిత్రాల్లో ఆమె నటించి బాలీవుడ్ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా నిలిచారు. శ్రీదేవి పలు అవార్డులు కూడా అందుకున్నారు. భారత ప్రభుత్వం 2013లో పద్మశ్రీతో సత్కరించింది. తన సినీ కెరీర్లో 14 సార్లు ఫిలింఫేర్‌కు నామినేట్ కాగా, నాలుగు సార్లు ఉత్తమనటిగా, రెండుసార్లు స్పెషల్ జ్యూరీగా అవార్డులు అందుకున్నారు. తెలుగులో ఆమె నటించిన ‘క్షణక్షణం’ చిత్రానికి ఉత్తమ నటిగా నంది అందుకున్నారు. సీఎన్ఎన్-ఐబీఎన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ఇన్ 100 ఇయర్స్’గా శ్రీదేవి ఎంపికయ్యారు. బాలీవుడ్ నిర్మాత, హీరో అనిల్ కపూర్ సోదరుడు బోనీకపూర్‌ను 1996జూన్ 2న ఆమె వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషి. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన శ్రీదేవి 2004-05 మధ్యకాలంలో మాలినీ అయ్యర్‌గా బుల్లితెర మీద కొద్దికాలం కనిపించారు. నిర్మాతగా హిందీలో సల్మాన్‌తో ‘వాంటెడ్’గా నిర్మించారు. 2012లో వచ్చిన ‘ఇంగ్లీష్-వింగ్లీష్’ చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవలే ‘మామ్’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం పెద్ద కుమార్తె జాన్వీని వెండితెరకు పరిచయం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ‘దడాక్’ పేరుతో తీస్తున్న ఈ రిమేక్ చిత్రానికి కరణ్ జోహర్ దర్శకుడు. శ్రీదేవి మృతిపట్ల బాలీవుడ్‌తో పాటు, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.