అగ్రస్థానానికి చేరుతున్న భారత్ - ఉపరాష్ట్రపతి


భారత దేశ ఆర్థిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో ప్రపంచంలోని అనేక దేశాలను తలదన్నే స్థాయిలో ఎదుగుతోందని ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖలో మూడు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సును ఉపరాష్టప్రతి శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఐదు,పదేళ్లలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థికశక్తిగా భారత్ నిలవనున్నాడని పేర్కొన్నారు. దేశంలో సగటు ఆదాయం ఐదు వేల డాలర్లకు పెరుగుతుందని చెబుతూ.. ఇవి మనకు మనం చెప్పుకుంటున్న గొప్పలు కావని, ప్రపంచబ్యాంక్, ఏడీబీ, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్స్ ఇచ్చిన నివేదికలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే, అతి తక్కువ కాలంలోనే భారతదేశం ఆర్థికరంగంలో అగ్రదేశాలను దాటి ముందుకు వెడుతుందని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు పాలసీ టేకర్స్‌గా ఉన్న ఇండియా, చైనా, బ్రెజిల్ ఇప్పుడు పాలసీ మేకర్స్‌గా మారుతున్నాయని చెప్పారు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి ఆర్థిక సంస్కరణలు మన ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చాయన్నారు. ఆ సంస్కరణల ఫలితంగా ఆదాయపన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, సంస్కరణలకు ముందు 6.74 కోట్ల మంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఉండగా, ఇప్పుడు 8.25 కోట్లకు పెరిగారని వెంకయ్య చెప్పారు. ఎక్కడెక్కడో దాగి ఉన్న డబ్బును తిరిగి బ్యాంకులకు రప్పించడం అన్నది సామాన్యమైన విషయం కాదని, ఈ సంస్కరణను చాలా మంది వ్యతిరేకించినప్పటికీ అమలు చేశారని, బ్యాంకులకు చేరిన డబ్బులో నల్లడబ్బు ఎంత అనేది రిజర్వ్ బ్యాంక్ తేలుస్తుందని ఆయన అన్నారు. జీఎస్టీ గొప్ప సంస్కరణ అని, కేంద్ర నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు పలకడం వలన ఏకాభిప్రాయం సాధించగలిగామని అన్నారు. గత ప్రధానులు మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణల ఫలాలను ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు. వచ్చే సంవత్సరం సరిగ్గా ఇదే సమయానికి భారతదేశ సంపద గణనీయంగా పెరుగుతుందని, రాష్ట్రాలకు ఎంత అదనపు ఆదాయం వస్తుందో మీరే చూస్తారని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఉన్నత స్థాయిలో ఉన్నామంటే, రాష్ట్రాల సహకారమే కారణమని అన్నారు. అభివృద్ధిపథంలో ఆంధ్రప్రదేశ్: సురేశ్ ప్రభు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలుగా అండగా నిలబడుతోందని అన్నారు. అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ అన్నిరంగాల్లో మరింత బలోపేతమవబోతోందని అన్నారు. ఆటోమొబైల్ మేకర్స్, ఆటో కంపొనెంట్ మేకర్స్ మధ్య జరిగిన ఒప్పందాన్ని చూస్తే, ఈ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉందని అర్థమవుతోందని అన్నారు. తూర్పు తీరంలో త్వరలోనే అతి పెద్ద ఆటో హబ్ రూపుదిద్దుకోబోతోందని మంత్రి చెప్పారు. దేశంలో తిరిగే అతి పెద్ద కార్లన్నీఏపీలోనే తయారు కానున్నాయని ఆయన చెప్పారు. తూర్పు తీరంలో అతి పెద్ద ఆటో కాంపొనెంట్ సెంటర్‌ను అభివృద్థి చేయాలని కేంద్రం అనుకున్న వెంటనే దాన్ని ఏపీలోనే నెలకొల్పాలని చంద్రబాబు కోరడాన్ని చూస్తే, రాష్ట్ర పారిశ్రామికాభివృద్థిపై ఆయనకున్న ఆపేక్ష అర్థమవుతోందని అన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో ఏపీ నెంబర్‌వన్ స్థానంలో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రపంచదేశాల్లో టాప్‌టెన్ స్థానంలో ఉంటామని ఆయన చెప్పారు. ఏపీలో రియల్‌టైం గవర్నెన్స్ సమర్థవంతంగా ఉందని అన్నారు. అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టును ఐదు వేల కోట్ల రూపాయలతో అభివృద్థి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. నీరు, విద్యుత్, భూమికి ఎటువంటి కొరత లేదని అన్నారు. కేవలం 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తామని సీఎం చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రపంచ ఉత్తమ నగరాలను రాష్ట్రంలో తయారు చేసుకునేందుకు సిఐఐ మంచి అవకాశాలు కల్పిస్తోందని చంద్రబాబు చెప్పారు. ప్రపంచం అంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని, భారత్‌కు వచ్చిన వారు ఏపీ వైపు చూడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. గత మూడు సంవత్సరాల్లో 13.54 లక్షల కోట్ల మేర 1946 ఎంఓయూలు జరిగాయని చంద్రబాబు చెప్పారు. ఇవి సాకారమైతే 31 లక్షల ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఇప్పటి వరకూ ఈ ఓప్పందాల్లో 59 శాతం వాస్తవరూపం దాల్చాయని అన్నారు. రానున్న ఐదు సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవుతాయని, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. గుజరాత్‌ను మించిపోతారని అన్న అదానీ సెంటల్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్స్ కార్యదర్శి రమేష్ అభిషేక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అవసరాలకు కావల్సిన వౌలిక సదుపాయాలు శరవేగంగా అభివృద్థి చెందుతున్నాయని అన్నారు. అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని మాట్లాడుతూ ఇప్పటి వరకూ గుజరాత్‌కు చెందిన వారే ఉత్తమ పారిశ్రామికవేత్తలని గుర్తింపు తెచ్చుకున్నారని, అయితే, చంద్రబాబు మార్గదర్శకంలో త్వరలోనే తెలుగువారు అత్యుత్తమ పారిశ్రామికవేత్తలుగా ఎదగనున్నారని అన్నారు. సీఐఐ డైరక్టర్ జనరల్ చటర్జీ బెనర్జీ, సీఐఐ అధ్యక్షురాలు శోభనా కామినేని తదితరులు ప్రసంగించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం