కర్ణాటక స్పీకర్ గా రమేష్ కుమార్


కర్ణాటక విధానసభ స్పీకర్‌గా కాంగ్రెస్‌ నేత రమేశ్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. సభాపతి ఎన్నికకు జరిగిన పోటీలో భాజపా నేత సురేశ్‌కుమార్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో రమేశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ బోపయ్య ప్రకటించారు. అనంతరం రమేశ్ కుమార్‌ సభాపతిగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో సభాపతి స్థానానికి కాంగ్రెస్‌, భాజపాల మధ్య పోటీ ఏర్పడింది. కాంగ్రెస్‌ తరఫున శ్రీనివాసపురం విధానసభసభ్యుడు కె.ఆర్‌.రమేశ్‌కుమార్‌, భాజపా తరఫున రాజాజీనగర సభ్యుడు ఎస్‌.సురేశ్‌కుమార్‌ గురువారం నామినేషన్లు సమర్పించారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం విధానసభ ప్రారంభమైన తర్వాత స్పీకర్‌ ఎన్నిక చేపట్టారు. అయితే చివరి నిమిషంలో భాజపా వెనక్కితగ్గడంతో స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. మరికాసేపట్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వం సభలో బలనిరూపణ చేసుకోనుంది. ఈ కూటమికి సంఖ్యాబలం ఉండటంతో విశ్వాసపరీక్షలో విజయం లాంఛనమే కానుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన స్పీకర్‌ రమేశ్‌కుమార్‌కు భాజపా శాసనసభా పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అభినందనలు తెలిపారు. స్పీకర్‌ పదవికున్న గౌరవం నిలబెట్టేందుకే ఏకగ్రీవం చేయాలనుకున్నామని అన్నారు. అందుకే చివరి నిమిషంలో స్పీకర్‌ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం