బిజెపి వర్సెస్ యాంటీ బిజెపి


మొత్తానికి ప్రాంతీయ పార్టీల ముసుగులోని వారసత్వ రాజకీయ, వ్యక్తి ఆధారిత, నియంతృత్వ పార్టీలు తమ రంగులను బయట పెట్టుకున్నాయి.. బెంగళూరులో రాసుకు పూసుకు మురిసిపోయాయి.. మోదీ ఫోబియా వీరి సైద్దాంతిక హద్దుల్ని చెరిపేసింది.. రాజకీయ అవకాశవాదం అందరినీ కలిపింది.. దేశంలో పోరాటం ఇప్పుడు బీజేపీ వర్సెస్ యాంటీ బీజేపీ మాత్రమే.. గతంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలకునే వారికి ఆప్షన్స్ ఉండేవి.. జాతీయ పార్టీలైన బీజేపీ, సీపీఎం, సీపీఐ లేదా ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, టీఆరెస్, తృణమూల్, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జీడీ, జేడీఎస్.. అన్నాడీఎంకే, డీఎంకే లాంటి ద్రవిడ పార్టీలు రంగంలో ఉండేవి.. (వైసీపీ, అన్నాడీఎంకేల వైఖరి తేలనందున ఇక్కడ ప్రస్థావించడం లేదు).. కానీ ఇప్పుడు బీజేపీ వద్దనుకునే వారు ఈ పార్టీల్లో ఎవరికి ఓటు వేసినా సరిపోతుంది. ఇప్పడు రెండే ఆప్షన్స్ మిగిలాయి.. బీజేపీ లేదా ఇతరులకు.. ఒకప్పుడు అవినీతి, అసమర్థ, వంశ పారంపర్య, ప్రజాస్వామ్య విరుద్ద పాలనకు మారు పేరైన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమై కూటములు ఏర్పాటు చేసి ఎన్నికలను ఎదుర్కొనేవి.. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది.. నిన్న మొన్నటి దాకా వద్దు అనుకున్న కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు వారికి ముద్దు అయిపోయింది.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో చేతులు కలిపాయి.. బెంగళూరులో కర్ణాటక ప్రజల అభిమతానికి విరుద్దంగా ఏర్పాటైన కుమార స్వామి ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం ఇందుకు వేదికైంది.. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ ను అడ్డుపెట్టుకొని తిరిగి అధికారంలోకి రావడం వీరికి అభ్యంతరకరం అనిపించలేదు.. కన్నడ ప్రజలు అత్యధిక సీట్లు కట్టబెట్టిన బీజేపీకి కొన్ని సీట్లు తగ్గాయనే సాంకేతిక కారణాలతో యడ్యూరప్ప ప్రభుత్వాన్ని అడ్డుకొని అపవిత్ర బంధానికి అక్షింతలు వేశారు. ఎన్టీరామారావు తెలుగు వారి ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తమ సైద్ధాంతిక విరుద్ద పార్టీ అయిన కాంగ్రెస్ చంకలో చేరడానికి రెడీ అయిపోయారు. రాహుల్ గాంధీతో చేతులు కలిపి, ఆచన భుజాలు తట్టి స్పష్టమైన సంకేతం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణల్లో టీడీపీ, కాంగ్రెస్ అలయన్స్ ను మనం చూడబోతున్నాం అన్నమాట.. ఇక తెలంగాణలో అధికార టీఆరెస్ కు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీల వేదికను ఏర్పాటు చేస్తున్నకేసీఆర్ తమ ఫ్రంట్ లో భాగస్వామి అయిన జేడీఎస్, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నారు. దీన్ని ప్రాంతీయ పార్టీల విజయంగా అభివర్ణించి సమర్ధిస్తున్నారు. అయితే కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లకుండా ముందు రోజే బెంగళూరు వెళ్లి అభినందించి వచ్చారు.. ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫెడరల్ ఫ్రంట్, కాంగ్రెస్ ఒకే జట్టులోని భాగస్వాములు అనే సంకేతం తెలంగాణ ప్రజలకు అందింది. బీజేపీని ఉత్తరాది పార్టీగా నిందించిన వారికి సోనియా, రాహుల్, మమత, మాయ, అఖిలేశ్, లాలూలే ఎక్కడి వారో కనిపించడం లేదు.. దక్షిణాదిన బీజేపీ ప్రభుత్వాలు లేక పోవచ్చు.. కానీ అన్నా డీఎంకే తర్వాత బీజేపీ శాసనసభ్యులే దక్షిణ భారత దేశంలో ఉన్నారనే విషయం మరువరాదు.. సో.. 2019 ఎన్నికలు బీజేపీ వర్సెస్ యాంటీ బీజేపీ అనేది సుస్పష్టం..

ముఖ్యాంశాలు