లక్ష్యం లేని పోరు.. బాబు నెత్తిన బిజెపి పాలు !


కేవలం వ్యక్తిపూజ, కేవలం వ్యక్తి నింద ఎక్కడైనా సరే తప్పే. అది ఇప్పుడు దేశంలోను, రాష్ట్రంలోనూ కూడా కనిపిస్తోంది. పాలకులపై వ్యతిరేకత సహజం. కానీ సరైన ప్రత్యామ్నాయం లేకుండ గుడ్డిగా వ్యతిరేకించడం కూర్చున్న కొమ్మని నరుక్కోవడం లాంటిది. అక్కడ మోడీని వ్యతిరేకించేవారు ఏ ప్రత్యమ్నాయాన్ని చూపలేకపో తున్నారని విమర్శి స్తున్న బిజెపి వారు.. ఇక్కడ చంద్రబాబుకి ఏ ప్రత్యామ్నాయం చూపి తాము విమర్శి స్తున్నారో కూడా చెప్పాలి. చంద్రబాబుని ఓడించాలని చెబుతున్న బిజెపి మరో ప్రశ్నకి కూడా స్పష్టంగా సమాధానం చెప్పాలి.. చంద్రబాబుకి కాకుండా ఎవరికి ఓటేయాలి? జగన్మోహన్ రెడ్డి పార్టీకా, పవన్ కళ్యాణ్ పార్టీకా, లేక బిజెపికా? పవన్ కళ్యాణ్, కమ్యూనిస్టులు కలిసి సాగుతున్నారు కాబట్టి ఆ పార్టీతో బిజెపి పొత్తు ఉండకపోవచ్చు అనేది జనాభిప్రాయం. బిజెపి అసలు సొంతంగా, అన్ని సీట్లకూ పోటీ చేసే పరిస్థితి ఉందా, పోటీ చేసినా ఇప్పటి పరిస్థితుల్లో గెలిచే సీన్ ఉందా? ప్రజలైతే ఈ పరిస్థితుల్లో ఇప్పుడిక్కడ బిజెపి పోటీ చేస్తే డిపాజిట్లు రావని అంటున్నారు. ఈ రెండూ తేలేవరకూ (కనీసం బిజెపి వారికైనా ఒక అంచనా వచ్చేవరకూ) బిజెపి ఇక్కడ ప్రత్యామ్నాయం అవలేదు కదా! ఇక మిగిలింది జగన్ పార్టీ. ఒకవేళ బిజెపి వైకాపాకి సపోర్ట్ చేసి తద్వారా తెదేపాపై కక్ష తీర్చుకోవాలనుకుంటోందా? తాము గెలవకపోయినా, తెలుగుదేశం పార్టీని ఓడిస్తే చాలనుకుంటున్నదా? ఒకవేళ బిజెపి ఈ వ్యూహం అమలు చేస్తుంటే మాత్రం చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్టే! బిజెపికి, వైకాపాకి ఒడంబడిక ఉంటే బిజెపికి స్వాభావికంగా పడే కొన్ని ఓట్లు ఆ పార్టీకి పడవు.. అలాగే జగన్ కి స్వాభావికంగా పడే ఓటు వైకాపాకి దూరం అవుతాయి. బిజెపి, జగన్ దూరదూరంగా ఉంటేనే జగన్ తెలుగుదేశానికి బలమైన ప్రత్యర్థి. క్రైస్తవులు, మహ్మదీయులు, దళితుల ఓటు బ్యాంకుని నమ్ముకుని వైకాపా మనుగడ సాగుతోంది. బిజెపితో కలిస్తే లేదా తెరచాటు ఒడంబడిక ఉంటే ఆ ఓట్లు పడతాయా అన్నది అనుమానమే. కాబట్టి బిజెపి తాడెత్తున చంద్రబాబుపై సాగిస్తున్న వ్యతిరేక ప్రచారానికి ఒక లక్ష్యం, గమ్యంలేకుండా పోతోంది. యుద్ధం ఎవరితో, ఎందుకు, ఎవరు చేస్తున్నారు అనేది తెలియకుండా అస్త్రాలు వృథా అవుతున్న పరిస్థితి బిజెపి శిబిరంలో కనిపిస్తోంది. బిజెపి నాయకులు సింగిల్ పాయింట్ అజెండాతో మాట్లాడుతున్నారు. ఆ పాయింట్ చంద్రబాబు అవినీతిపరుడు, ఆయనను ఓడించాలి అనే. నిన్నటివరకూ తమ చంకలో ఉన్న చంద్రబాబు ఆ చంక దిగగానే అవినీతి పరుడు ఎలాఅయ్యాడని జనం అడిగిగితే బిజెపి సమాధానం చెప్పాలి. పైగా చంద్రబాబుని తాము ఎన్ డి ఏ నుంచి బయటికి పంపలేదు. ఆయనే ఎన్ డి ఏ ని విసిరేసి వెళ్లిపోయాడు. అవినీతిని పసిగట్టి తోసేశామని చెప్పుకోవడానికి కూడా బిజెపికి ఛాన్స్ లేదు. తాము బలపడకుండా, తమ ఛాన్సులు మెరుగుపరచుకోకుండా, రాష్ట్రంలో ఇదీ ప్రత్యామ్నాయం.. ఇడుగో నాయకుడు అని చూపించకుండా బిజెపి ఎందుకు హోరున బాబుకి వ్యతిరేకప్రచారం చేస్తున్నదో అర్థంకాక పరిశీకులు గందరగోళపడుతున్నారు. వైకాపాతో తెరవెనుక ఒప్పందం ఉందని, బిజెపి, వైకాపా, జనసేన కూటమిగా వెళ్లే అవకాశం ఉందని, నేరుగా కూటమి కడితే బలహీనపడే ప్రమాదం ఉంది కాబట్టి బిజెపి చంద్రబాబుపై కేసులు పెట్టి... ఆపైన ఆర్థికంగా వైకాపా, జనసేనలకు సహాయం చేసి గెలిచేలా చేస్తుందని... ఇలా ఏవేవో ఊహాగానాలు చేస్తున్నారు. ఇవేవీ నిజాలు కాకపోయినా.. బాబు ఓటమి కోసం బిజెపి తపన పడుతోంది అనేది మాత్రం నిజం. అలాజరగాలంటే తెలుగుదేశం పార్టీని ఏదో ఒకపార్టీ ఓడించాలిగా. తమపరంగా ఆ శక్తి సాధించేందుకు, ఆ పని చేసేందుకు ఏ ప్రయత్నాలు చేయకుండా ఉత్తినే వాగ్ధాటిని ఉపయోగిం చడం చూస్తుంటే .. ఆ శక్తి ఉన్న పార్టీకి పరోక్షంగా సహకరిద్దాం అనే ధోరణి మాత్రమే బిజెపి వారిలో కనిపిస్తుంది. ఇది బిజెపి జాతీయ స్థాయి నిర్ణయమా..లేక రాష్టంలో నేతల విధానమా అనేది ఇంకా తేలాల్సి ఉంది. బిజెపి ఇలాగ బాబుపై ఫైట్ కొనసాగిస్తే అది వైకాపాకి కలిసివస్తుంది... ఒకవేళ వైకాపా, జనసేన తదితర పార్టీలతో ఏదోవిధంగా (ప్రత్యక్షంగాలేదా పరోక్షంగా) కలిసి పయనిస్తే మాత్రం బాబుకి ప్లస్ అవుతుంది అని ఇప్పటి పరిస్థితుల్లో పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యాంశాలు