కూటమి ఎత్తుల్లో చిత్తయేది ఎవరు?


రాష్ట్రంలో అధికారం మాత్రమే చాలదు... ఎంపీ సీట్లు ఎక్కువగా కావాలి.. కేంద్రంలోనూ పైచేయి సాధించాలి. పీఎం ని నిర్ణయించే స్థాయి, శాసించే సంఖ్యాబలం తమదవాలి. ఇదీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశ, అభిమతం! వారి అధికార దాహాన్ని తప్పుపట్టలేం. ఎందుకంటే రాజకీయనాయకుడి నైజమే అంత. అయితే వారి రాజకీయ దాహం ప్రజలకి నీళ్లు దొరక్కుండా చేస్తుందా? ఈ విషయాన్ని చర్చిద్దాం ఇప్పుడు.

కాంగ్రెస్‌, భాజపాయేతర కూటమి ఏర్పాటే తన మిషన్‌ అని తెలంగాణ సీఎం కేసీఆర్ అంటున్నారు. ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ని, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. ఈ భేటీల తీరుని చూస్తే కేసీఆర్ ఏదోహిడెన్ అజెండాతో ఉన్నారని అర్థం అవుతుంది. అయన చంద్రబాబు చాపకిందికి నీళ్లు తెస్తారా అనే అనుమానం కూడా కలుగుతోంది. చంద్రబాబుకి కేసీఆర్ ఇవ్వదలచుకున్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అనే సందేహమూ తలెత్తుతోంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు కాంగ్రెస్ సహిత కూటమిని తయారు చేసే ప్రయత్నంలో మునిగి ఉన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్, జనసమితి తో కలిసి పోటీ కూడా చేసారు. అయితే ఆ పోటీ తెదేపా, కాంగ్రెస్ పార్టీలు రెంటికీ ఘోర పరాభవం మిగిల్చింది. రాహుల్ గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, ములాయం, ఫరూక్ అబ్దుల్లా, స్టాలిన్, కుమారస్వామి తదితరులను కలిపి బలమైన కూటమి తయారు చేసి రేపటి ఎన్నికల్లో చక్రం తిప్పాలని బాబు గట్టిగా ఆశపడ్డారు. బిజెపిపై ఆయనకు గల కోపమే ఇందుకు ప్రధాన కారణం అని వేరే చెప్పనక్కరలేదు. ఇలా పెద్దఎత్తున తపన పడి మోడీపై కసి తీర్చుకునేందుకు బాబు నానా యాతన పడుతున్నసమయంలో కేసీఆర్ రంగప్రవేశం చేసి ఫెడరల్ ఫ్రంట్ అనడం, అదీ కాంగ్రెస్, భాజపాలు లేని కూటమి పెడతాను అనడం గమనార్హం. ఇది కచ్చితంగా చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లడమే. ఇప్పుడు నవీన్ పట్నాయక్ గానీ, మమతా బెనర్జీ గానీ బాబు, కేసీర్ ఇద్దరిలో ఎవరో ఒకరితోనే ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అదే జరిగితే కాంగ్రెస్ తో కలిసి వచ్చిన బాబు కంటే ప్రత్యేక ఫ్రంట్ ప్రతిపాదనతో వచ్చిన కెసీఆర్ ప్రతిపాదనకు వారు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. మాయావతి, మమతా, ములాయం కూడా స్వతహాగా కాంగ్రెస్ తోకలిసే యోచన చేయకపోవచ్చు. ఎన్నికలో వీలైనన్ని సీట్లు గెలిచాక అప్పుడు అవసరాన్ని బట్టి కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలన్నదే వారి ఆంతర్యం. ఈ క్రమంలో వచ్చిన సీట్లను బట్టి, అప్పటికి కాంగ్రెస్ కి తమతో ఉన్న అవసరాన్ని బట్టి బేరసారాలు చేయడం అసలు అజెండా. ఒకవేళ తమ మద్దతుతో బిజెపి పవర్లోకి వచ్చే పరిస్థితి ఉన్నా వారికి అభ్యంతరం ఉండదు. బిజెపి, కాంగ్రెస్ రహిత కూటమి అంటే అర్థం సీట్లను బట్టి ఎవరికైనా సరే మద్దతు ఇవ్వడమే కావచ్చు. అనుకూలంగా సీట్లు వస్తే కాంగ్రెస్ బీజేపీలను వాడుకొని కూటమిలో నాయకులు పీఎం కావాలనేది కూడా వారి చర్చల్లో ఉంది. ప్రస్తుతం పరిస్థితిని బట్టి కేసీఆర్ విన్నర్ గా, చంద్రబాబు లూజర్ గా దేశంలోని రాజకీయ పార్టీలకి కనిపిస్తున్నారు. పోనీ కేసీఆర్ పెట్టిన ఫ్రంట్ లో బాబు చేరతారా ఇక బాబు ఫ్రంట్ లో కేసీఆర్ గ్రూపు కలుస్తుందాఅని ఆలోచిస్తే అది సాధ్యం కాదనిపిస్తుంది. మాది ఏ ఫ్రంట్ కీ బి పార్ట్ కాదు మాదే అసలైనకూటమి అని నవీన్, కేసీర్ కలిసి చేసిన ప్రకటన ఇక్కడ గమనార్హం. మొత్తానికి దేశంలో మరే నాయకుడికీ లేని చొరవ, స్పీడు మన తెలుగు నాయకులకే ఉన్నాయని.. పోటాపోటీగారెండు కూటములు కట్టారని మనం గర్వపడాలా లేక మన నాయకుల అనైక్యతని, పరస్పర కుట్రని చూసి బాధపడాలా అర్థం కానీ అగమ్య పరిస్థితి ఉంది.

రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ తెలంగాణాలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకొంటుందనేది ఆ పార్టీల ప్రస్తుత అంచనా. ఆంధ్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ కలుగజేసుకోవడం అంటే పరోక్షంగా జగన్ పార్టీకి మద్దతు పలకడమే అనేది బహిరంగ రహస్యం. అంటే కేసీఆర్ పెడుతున్న ఫెడరల్ ఫ్రంట్ లో ఆంధ్రానుంచి ఉండబోయేది వైకాపా అనేది సూచనప్రాయంగా తెలుస్తోంది. ఇది రాజకీయంగా చంద్రబాబుకి కేసీఆర్ పెట్టబోతున్న చెక్. అలాగే మరో ఎత్తుగడకు కూడా కేసీఆర్ సిద్ధం అవుతున్నారని అనుకోవలసి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణాకి, ఒడిశాకు కలిపి ఉన్న ఉమ్మడి సమస్య నీళ్లు! ఇప్పుడు తెలంగాణ సీఎం, ఒడిశా సీఎం కలయిక వెనుక జలరాజకీయం కూడా ఇమిడి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. పోలవరానికి అటు తెలంగాణ, ఇటు ఒడిశా కూడా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రం తో విరోధం పెట్టుకొని, ఉత్తరాది, దక్షిణాది నినాదం ఎత్తుకున్న చంద్రబాబు మరి పొరుగు రాష్ట్రాలతో ఈ వివాదానికి ఏమి కారణం చెబుతారు? మొత్తానికి దేశ రాజకీయాలోచక్రం తిప్పాలన్న కొందరు రాష్ట్ర నాయకుల ఆశల కారణంగా ప్రజలకి నీటి కష్టాలు రానున్నాయా అనే ఆందోళన కలుగుతోందిప్పుడు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం