ఇక ఎన్ని లడ్డూలయినా కొనుక్కోవచ్చు!

తిరుమలలో శ్రీవారి భక్తులకు అడిగినన్ని అదనపు లడ్డూలు విక్రయించడం కోసం టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. ఉచిత లడ్డూ, సబ్సిడీ లడ్డూల విధానం కొనసాగిస్తూనే, అదనపు లడ్డూలను పెద్దఎత్తున విక్రయించాలని భావిస్తోంది. పెంచిన లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా వచ్చిన రాబడితో లోటు భారాన్ని పూడ్చుకోవచ్చని ధార్మిక సంస్థ అంటున్నది. ఇటీవల టీటీడీ రూ.25 ధరతో విక్రయించే చిన్నలడ్డూ (175 గ్రాములు) రూ.50, కల్యాణోత్సవం లడ్డూ రూ.100 నుండి రూ.200, వడ ప్రసాదం రూ.25 నుండి రూ.100కి పెంచిన విషయం తెలిసిందే. దీంతో బ్లాక్‌లో లడ్డూల విక్రయాలు బాగా తగ్గిపోయాయి. అయినప్పటికీ  డిమాండ్‌ చాలా ఉండడంతో ఆమేరకు లడ్డూలు దొరక్క భక్తులు అసంతృప్తికి లోనవుతున్నారు. ముఖ్యంగా రూ.50 ధర ఉన్న లడ్డూకు డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉంది. ఈ దృష్ట్యా అదనపు లడ్డూలు ప్రస్తుతం అందుబాటులో ఉంచుతున్న 30 వేలకు బదులు 50వేలకు పెంచాలని టీటీడీ ప్రణాళికగా ఉంది. 2017–2018 లో లడ్డూ తయారీ ఖర్చు రూ.37కి పెరిగింది. టీటీడీ ఉచిత లడ్డూ, రూ.10 చొప్పున రెండు సబ్సిడీ లడ్డూలు, రూ.25 ధరతో రెండు లడ్డూల సరఫరా కొనసాగిస్తున్నందువలన ఏటా టీటీడీపై రూ.250 నుండి రూ.300 కోట్ల మేర భారం పడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రోజూ అదనంగా 30వేల లడ్డూలు సబ్సిడీ లేకుండా మాత్రమే కాకుండా పెంచిన ధరలకు (రూ.37 ఖర్చయే లడ్డూని రూ. 50కి) విక్రయిస్తున్నారు. ఈ సంఖ్యను 50వేలకు పెంచగలిగితే ఆదాయం పెరిగి సబ్సిడీ బరువు తాగుతుందనేది తితిదే ఆలోచన. అలాగే వడ ప్రసాదం, కల్యాణోత్సవం లడ్డూల విక్రయాలు కూడా పెంచాలని ప్రతిపాదనలున్నాయి. 

Facebook
<