రాష్ట్ర అటవీ అకాడమీ సదుపాయాల పరిశీలన


రాజమహేంద్రవరం దివాన్‌చెరువు పరిధిలో ఉన్న ఎపి రాష్ట్ర అటవీ అకాడమీలోని సదుపాయాలను, పురోగతిలో ఉన్న వివిధ పనులను శుక్రవారం అటవీ అకాడమీ సంచాలాకులు, ముఖ్య అటవీ సంరక్షణాధికారి జెఎస్‌ఎన్‌ మూర్తి పరిశీలించారు. అనంతరం అకాడమీ, రీసెర్చ్‌ విభాగం అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచాలాకులు మాట్లాడుతూ రాష్ట్ర అటవీ అకాడమీ పూర్తిస్థాయిలో పనిచేసేందుకు, నిరంతరాయంగా అటవీ సిబ్బందికి, అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించేందుకు అనువైన ప్రణాళికను రూపొందించాలని సూచించారు. సామాజిక వన విభాగం, వైల్డ్‌ లైఫ్‌, వన సంరక్షణ సమితులు, ఎకో టూరిజం... ఇలా అన్ని విభాగాల్లోనూ సూక్ష్మస్థాయి వరకూ శిక్షణ మాడ్యూల్స్‌ ను సిద్ధం చేయాలన్నారు. అటవీ అకాడమీ ప్రాంగణం, పరిసరాల సుందరీకరణ, పరిశుభ్రత విషయంలో తీసుకోవలసిన పలు చర్యలపై ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. అకాడమీలో ఉన్న వనరులన్నీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలన్నారు. డైనింగ్‌ హాల్‌, కాన్వొకేషన్‌ హాల్‌, ట్రెయినీస్‌ అకామిడేషన్‌ బ్లాక్‌ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అకాడమీలోని సమావేశ మందిరాలను, సీడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్‌, లైబ్రరీ, మెస్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, టిస్యూ కల్చర్ ల్యాబ్‌ను పరిశీలించారు. గ్రంథాలయంలో పుస్తకాల క్లాసిఫికేషన్‌కు నన్నయ యూనివర్సిటీ గ్రంథాలయ విభాగం సహకారాన్ని తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. బయో డీజిల్‌ ప్లాంట్‌లో యంత్రాలకు మెయింటెనెన్స్‌ పనులు చేయించి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. బోధనాసిబ్బంది రూపొందించిన లెసన్‌ ప్లాన్స్‌ (పాఠ్య బోధన ప్రణాళిక)ను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అకాడమీ బస్సు, వ్యాన్‌ నిర్వహణ పనులకు, కార్యాలయ పనులకు సంబంధించి అధికారులు చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ నిధులు విడుదల చేశారు. స్టేట్‌ ఫారెస్ట్‌ అకాడమీలో బీట్‌ ఆఫీసర్లు, సెక్షన్‌ ఆఫీసర్ల శిక్షణ నిమిత్తం నాలుగు డబుల్‌ బారెల్‌ రైఫిళ్ళను రాష్ట్ర అటవీదళాధిపతి పి.మల్లికార్జునరావు మంజూరు చేశారని ఆయన తెలిపారు. రాష్ట్ర అటవీ అకాడమీ ఉపసంచాలకులు వైఎస్‌ నాయుడు, ఎంవి ప్రసాదరావు, ఫ్యాకల్టీ సభ్యులు ఎ రామారావు, ఎస్‌వి రమణ, కె రాజేంద్రప్రసాద్‌, పి ఉదయ్‌శంకర్‌, స్టేట్‌ సిల్వికల్చరిస్ట్‌ శ్రీహరిగోపాల్‌, హవల్దార్‌ ఆదాంరాజు, ఫిజికల్‌ ట్రెయినర్‌ శ్యాంబాబు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం