అది హత్యాయత్నం.. అతడు తెదేపా కార్యకర్త


వైఎస్‌ జగన్‌పై దాడికి పాల్పడిన జానపల్లి శ్రీనివాసరావు‌ జగన్‌ అభిమాని కాదని, తెదేపా కార్యకర్త అని వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న జగన్‌ను ఆయన పరామర్శించారు. జగన్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై దాడి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. 2003లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడి జరిగితే ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ హుటాహుటిన తిరుపతి వెళ్లి పరామర్శించారని గుర్తుచేశారు. దాడిని తీవ్రంగా గర్హిస్తూ గాంధీ బొమ్మ వద్ద నల్ల బ్యాడ్జీలతో వైఎస్ నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. నిందితుడు శ్రీనివాసరావు జగన్‌ అభిమాని, వైకాపా కార్యకర్త అన్నట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. శ్రీనివాసరావు జగన్‌ ఫోటోతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు బయటకు వచ్చిన ఫ్లెక్లీ కూడా తెదేపా నేతలు సృష్టించినదేనని ఆరోపించారు. జగన్‌పై జరిగిన దాడి ఆపరేషన్‌ గరుడలో భాగమేనని దానికి కథ, కథనం అంతా ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆరోపణలు చేశారు. శ్రీనివాసరావు కుటుంబం ఇల్లు కట్టుకునేందుకు ఇటీవలే రెండు లోన్లు తెదేపా నేతలే ఇప్పించారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. నిందితుడు జగన్‌ మెడలోకి కత్తి దించేందుకు ప్రయత్నించాడని.. ఆ సమయంలో ఆయన పక్కకు జరగడంతోనే ఎడమ భుజానికి తగిలిందని తెలిపారు. ఈ ఘటనకు కచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని సుబ్బారెడ్డి అన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం