అలోక్ వర్మ పిటిషన్ పై సుప్రీం విచారణ


అర్ధరాత్రి వేళ తన అధికారాలను తొలగించి, సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. అలోక్‌ వర్మపై వస్తున్న ఆరోపణలపై రెండు వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ చేపట్టేంత వరకు తాత్కా లిక డైరెక్టర్‌గా ఉన్న మన్నెం నాగేశ్వరరావు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలను తీసుకోరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబరు 12కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్‌ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తారని తెలిపింది. అక్టోబరు 23 నుంచి ఇప్పటివరకు నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయరాదని తెలిపింది.ఆలోక్‌ వర్మ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎఫ్‌ఎస్‌ నారిమన్ తన వాదనలు వినిపించారు. చట్టాలకు వ్యతిరేకంగా ఆలోక్‌ వర్మను సెలవుపై పంపుతూ కేంద్రం, సీవీసీ ఆదేశాలు జారీ చేశాయని నారిమన్‌ కోర్టుకు తెలిపారు. సీబీఐ అధినాయకుల మధ్య మొదలైన వర్గ పోరు ఇటీవల తీవ్రరూపం దాల్చి రచ్చకెక్కిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్‌ అస్థానాను సెలవుపై పంపుతూ మంగళవారం అర్ధరాత్రి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. డైరెక్టర్‌ బాధ్యతలను జాయింట్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావుకు అప్పగించింది. దీంతో కేంద్ర ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఆలోక్‌ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ముఖ్యాంశాలు