ఉగ్రదాడి సమాచారం ఇస్తే భారీ నజరానా


2008లో జరిగిన ముంబయి ఉగ్రదాడికి కుట్రదారుల సమాచారం ఇస్తే 5 మిలియన్‌ డాలర్ల (దాదాపు 35 కోట్లు) రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. ఉగ్రదాడికి పాల్పడిన, కుట్ర పన్నిన, సహాయ పడిన, దాడికి ప్రేరేపించిన వారి సమాచారం ఏదైనా తెలియజేస్తే ఈ మొత్తం రివార్డుగా ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం వెల్లడించింది. ముంబయిలో ఉగ్ర దాడి జరిగి పదేళ్లు అయిన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. ముంబై దాడిలో పది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు విచక్షణారహిత కాల్పులు జరిపి 166 మంది ప్రాణాలు తీశారు. మృతుల్లో ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు. ఇటీవల సింగపూర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌లు కలిసినప్పుడు ఈ విషయం గురించి పెన్స్‌ లేవనెత్తారు. ముంబయి ఉగ్రదాడి జరిగి పదేళ్లు అవుతున్నా దాడికి కుట్ర పన్నిన సూత్రధారులకు ఇప్పటివరకూ శిక్ష పడలేదని పెన్స్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. కాగా సోమవారం అమెరికాలోని స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ జస్టిస్‌(ఆర్‌జేఎఫ్‌) ఈ భారీ రివార్డును ప్రకటించింది. 2008 ముంబయి దాడులకు సంబంధించి తగిన న్యాయం జరిగేందుకు అమెరికా అంతర్జాతీయంగా ఇతర భాగస్వాములతో కలిసి పనిచేస్తోందని తెలిపింది. కాగా దీనిపై ఇలాంటి రివార్డు ప్రకటించడం ఇది మూడోసారి. గతంలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ గురించి సమాచారం ఇస్తే 10మిలియన్‌ డాలర్ల బహుమానం ఇస్తామని, లష్కరేకు చెందిన మరో సీనియర్‌ నేత హఫీజ్‌ అబ్దుల్‌ రెహమాన్‌ మక్కి గురించి చెప్తే 2మిలియన్‌ డాలర్లు రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది.

ముఖ్యాంశాలు