సోనియాపై మండిపడిన కేసీఆర్


ఈ ఎన్నికల్లో ప్రజలు, వారి ఆశలు, కోర్కెలు గెలవాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని, -ప్రజాశీస్సులతో నాలుగున్నరేళ్లు పాలించానని చెప్పారు. 70 ఏళ్ల కాంగ్రెస్‌, తెదేపాల పాలనలో చేయలేనివి ఎన్నో చేశామన్నారు. తాజాగా సోనియా గాంధీ తాను తెలంగాణ ప్రజలను చూసి తల్లడిల్లుతున్నానని, తన కడుపు తరుక్కుపోతున్నదని చేసిన వ్యాఖ్యలపై ఆయన దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వచ్చినట్లు నీకు మామూళ్ల సూట్‌కేసులు రావడం లేదా? తెలంగాణలో రైతులు, చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు మీ హయాంలో జరిగినట్లుగా జరగడంలేదా? ఎందుకమ్మా తల్లడిల్లిపోతు న్నావు అని వ్యంగ్యంగా నిలదీశారు. ముస్లింలకు ప్రధాన శత్రువు మోదీ అని కేసీఆర్ అన్నారు. వారికి రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రయత్నానికి అడ్డు తగులుతున్నారని ధ్వజమెత్తారు. తెరాస, ఎంఐఎం విజయం ఖాయం అని అసదుద్దీన్‌ ఒవైసీతో కలిసి కేంద్రంతో పోరాడి ముస్లిం రిజర్వేషన్లు సాధిస్తామని పేర్కొన్నారు. ఈసారి తెలంగాణ గడ్డమీద అడుగుపెట్టేటపుడు రాహుల్ గాంధీ తమకొక హామీ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేసారు. కాంగ్రెస్ ఏపీకి ప్యాకేజీ ఇస్తే ఇచ్చుకోవచ్చని, అయితే ఆ ప్యాకేజీ కింద పరిశ్రమలకు ఇచ్చే పన్ను రాయితీలు తెలంగాణలో పరిశ్రమలకూ ఇస్తామని చెప్పిన తర్వాతే తెలంగాణాలో అడుగు పెట్టనిస్తామని స్పష్టం చేసారు. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా నేనే కట్టాను, హైదరాబాదు అభివృద్ధి అంతా నాదే అనడం సిగ్గుచేటని, ఈ మాట వింటే కులీకుతుబ్‌షా ఆత్మహత్య చేసుకుంటాడని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్‌ దద్దమ్మలు రాసి ఇస్తే సోనియా గాంధీ చదువుతుందని మండిపడ్డారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం అమలు చేస్తున్నందుకు కాంగ్రెస్ కడుపు తరుక్కుపోతోందా?’’ అని సోనియాను ప్రశ్నించారు. ఆదివారం వికారాబాద్‌ జిల్లా తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో.. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గాల్లో.. రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో జరిగిన ప్రజాశీర్వాద సభల్లో కేసీఆర్‌ ప్రసంగించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం