వాజపేయిపై బయో పిక్ "యుగ్ పురుష్ అటల్"

భారతీయ జనతా పార్టీ ప్రసిద్ధ నేత, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి జీవిత చరిత్ర చలన చిత్రంగా రానుంది. ‘యుగ్పురుష్ అటల్’ పేరిట ఈ చిత్రం తీస్తున్నారు. సోమవారం ఆయన 93వ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ విషయాన్ని దర్శక, నిర్మాతలు వెల్లడించారు. స్పెక్ట్రమ్ మూవీస్‌కు చెందిన రాజీవ్ ధమీజా, అమిత్ జోషి, రంజీత్ శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కాలా సచ్ ఫేమ్ మయాంక్ శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నారు. వాజపేయి దత్తపుత్రిక నమిత, ఆమె భర్త రంజన్ భట్టాచార్య తదితర కుటుంబ సభ్యుల అనుమతితోనే ఈ సినిమాను నిర్మిస్తున్నామని, ఈ ప్రాజెక్టు విషయంలో వాజపేయి మేనకోడలు మాలా తివారీ చాలా సహకరించారని దర్శకుడు శ్రీవాత్సవ తెలిపారు. అటల్ రాసిన ఓ కవిత ఆధారంగా ఈ సినిమాకు ఓ గీతాన్ని బప్పీలహరి కంపోజ్ చేశారు. రాజకీయ వేత్తగానే కాకుండా గొప్ప కవిగా, చతుర భాషణునిగా పేరున్న వాజపేయి ప్రజా సమ్మోహన ప్రసంగీకులు కూడా. బ్రహ్మచారి అయినా అటల్ సైకిల్ పై తిరిగిన స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదిగారు. నిజాయితీతో కూడిన రాజకీయాలకు అటల్ నిలువెత్తు నిదర్శనం. అయన జీవన చిత్రం ఎందరికో స్ఫూర్తి దాయకం అవుతుంది అనడంలో సందేహం లేదు.