పాకిస్థాన్ కు యోగి "మెరుపు" హెచ్చరిక


కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్థాన్‌ కు ఉత్త్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గట్టి వార్నింగ్ ఇచ్చారు. వాస్తవాధీన రేఖ దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రవేశించి మరీ భారత బలగాలు ప్రతీకార కాల్పులు జరిపిన నేపథ్యంలో యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీనిపై విలేఖరులతో మాట్లాడుతూ స్పందించిన యోగి "సర్జికల్‌ దాడులు మళ్లీ మళ్లీ జరుగుతాయ్‌" అంటూ పాకిస్థాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు.2016 సెప్టెంబర్‌లో భారత ఆర్మీ పాక్‌లో సర్జికల్‌ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. 28 అర్ధరాత్రి సమయంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు మెరుపు దాడి చేశాయి. దాదాపు ఐదున్నర గంటల పాటు ఈ ఆపరేషన్‌ జరిగింది. ఈ దాడుల్లో కొందరు ఉగ్రవాదులు చనిపోయినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. ఇక తాజా విషయానికొస్తే శనివారం పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత జవాన్లపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందారు. అయితే దీనికి భారత్‌ కూడా ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం భారత ఆర్మీ సిబ్బంది నియంత్రణ రేఖను దాటి పాక్‌ రేంజర్స్‌పై కాల్పులు జరపగా ముగ్గురు పాక్‌ సైనికులు మృతిచెందారు. పాకిస్థాన్ ఈ ఏడాది డిసెంబర్ వరకు 80 సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో భారత్ ఆ దేశంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. అదే యోగి మాటల్లో ప్రతిఫలించిందని పరిశీలకులు భావిస్తున్నారు.

ముఖ్యాంశాలు