ప్రధానికి ఓ కార్యకర్త సూటి ప్రశ్న


ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా లైవ్‌లో మాట్లాడే కార్యక్రమం మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమాన్ని బీజేపీ తన కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు ప్రారంభించింది. తొలిదశలో తమిళనాడు, పుదుచ్చేరి కార్యకర్తలతో మోదీ నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకు న్నారు. ఆ కార్యక్రమంలో పుదుచ్చేరీకి చెందిన ఒక కార్యకర్త వేసిన ప్రశ్న మోదీని, బీజేపీని ఇరుకున పెట్టింది. పన్నులు వసూలు చేయడంలో బీజేపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, ప్రజా సంక్షేమంలో లేదని నిర్మల్ కుమార్ జైన్ అనే పాండిచ్చేరి పార్టీ కార్యకర్త నేరుగా మోడీని అడిగారు. మార్పు కోసం మీరు చేస్తున్న ప్రయత్నం మంచిదే. మధ్యతరగతి వర్గం ఆలోచన వేరుగా ఉంది. మీ ప్రభుత్వం కేవలం పన్నుల వసూలుపైనే దృష్టి పెట్టింది. ప్రజలకు మీరు ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదు. ఆదాయ పన్ను విషయంలో, లోన్ ప్రాసెసింగ్‌లో జనానికి అన్యాయమే జరుగుతోంది. బ్యాంక్ లావాదేవీల ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మధ్యతరగతి వర్గం మీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. వారికి కూడా ప్రోత్సాహకాలు అవసరం. పన్ను వసూలులో ఉన్న శ్రద్ధ సాయం చేయడంలో కూడా ఉండాలి. అని ఆ కార్యకర్త అన్నారు. అయితే మధ్యతరగతి వర్గానికి, పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వగలరో మోదీ అప్పటికప్పుడు స్పష్టంగా చెప్పలేకపోయారు. దీనితో మోదీపై సెటైర్లు వేస్తు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వణక్కం పుదుచ్చేరి అంటూ చేసిన ట్వీట్లో మోదీ పై రాహుల్ రెచ్చిపోయారు. ఇప్పటి దాకా మీడియాతో మాట్లాడేందుకే భయపడిన మోదీ, ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలకు కూడా భయపడాల్సి వస్తోందని సెటైర్ వేశారు. కాగా దీనిపై బీజేపీ, పిఎంఓ దిద్దుబాటు చర్యలను చేపట్టాయని సమాచారం. ఇకపై పీఎంతో లైవ్‌లో మాట్లాడే కార్యకర్తలను తామే ఎంపిక చేస్తామని బీజేపీకి పీఎంఓ చెప్పిందని తాజా వార్త. అంటే ప్రశ్నలను కూడా ముందే స్కాన్ చేస్తారన్న మాట. దీనికి ప్రధాని ఏమనుకున్నారో తెలియదు గానీ.. ఆ కార్యకర్త చెప్పినదైతే ముమ్మాటికీ నిజం! అయితే దీనికి పీఎంఓ తీసుకుంటున్న చర్యలు హాస్యాస్పదం! ఇకపై లైవ్ లోకి వచ్చే కార్యకర్తల్ని తామే ఎంపిక చేయాలని పీఎంఓ భావించడం అంటే తప్పులు, పొరపాట్లు తమ దృష్టికి రాకుండా తామే కళ్ళకి గంతలు కట్టుకోవడం అన్నమాట. పొరపాటునైనా సరే ఓ మంచి విషయం, ఓ నిజం దృష్టికి వచ్చింది కాబట్టి దానిని పరిష్కరించే చర్యలు తీసుకోవడం మంచిది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం