ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ


ప్రధాని నరేంద్ర మోదీని ఈ సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలిశారు. దిల్లీలోని ప్రధాని నివాసం 7 లోక కళ్యాణ్‌ మార్గ్‌ లో వీరి భేటీ జరిగింది. ఇందులో ప్రధానంగా రాష్ట్ర విభజన హామీలను కేసీఆర్ మోదీ దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి సీఎం అయిన తర్వాత తొలిసారి కేసీఆర్ దిల్లీ వచ్చారు. సమాఖ్య కూటమి ఏర్పాటులో భాగంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులను కలిసిన కేసీఆర్‌ సోమవారం రాత్రి దిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. మంగళవారం క్రిస్మస్‌ సెలవు రోజు కావడంతో ఆయన ఎవరినీ కలవలేదు. ప్రధానమంత్రితో భేటీలో ప్రస్తావించే అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించినట్టు సమాచారం. విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ట్రిపుల్‌ ఐటీ తదితర అంశాలపై ప్రధానికి మరోసారి కేసీఆర్‌ లేఖలు అందజేయనున్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటులో జాప్యంపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం