తెలుగు వారికి గర్వకారణం మహానటి


'ఈ చిత్రం ప్రారంభించినపుడు ఏమో ఎలా వుంటుందో అన్పించింది. తీరా చిత్రం విడుదలయ్యాక రిపీట్ ఆడియన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహానటి సావిత్రి జీవితాన్ని ఆవిష్కరిస్తూ తీసిన ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ అమోఘం. ప్రేక్షక మహాజనులందిరికీ కృతజ్ఞతలు' అని మహానటి చిత్ర బృందం పేర్కొంది. మహానటి చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడున్న నేపథ్యంలో చిత్రం బృందం విజయ యాత్ర చేపట్టింది. విజయవాడ లో పూర్తిచేసుకుని,ఆదివారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం విచ్చేసిన చిత్ర బృందం జె ఎన్ రోడ్డులోని ఎం ఆర్ ఆర్ రెసిడెన్సీలో విలేకరుల సమావేశంలో పాల్గొంది. మహానటి పాత్రధారి కీర్తి సురేష్, దర్శకుడు నాగ అశ్విన్,నటుడు రాజేంద్ర ప్రసాద్, నిర్మాతలు స్పప్న దత్, ప్రియా దత్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ డానియల్ లకు వి 3 ఎంటర్ టైన్ మెంట్స్ పక్షాన జిల్లా డిస్ట్రి బ్యూటర్ గా చిత్రాన్ని పంపిణీ చేసిన నెక్కంటి రామమోహనరావు చౌదరి తదితరులు స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈసందర్బంగా మహానటిలో సావిత్రి పెదనాన్న గా కెవి చౌదరి పాత్ర పోషించిన నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చాలాకాలం తర్వాత ఓ మంచి చిత్రాన్ని చూశామని తెలుగు ప్రేక్షకులు గుండెల మీద చేయివేసుకుని,సగర్వంగా చెప్పుకుంటున్నారన్నారు. ఈ చిత్రంలో అందరూ తమ పాత్రల్లో జీవించడం, సాంకేతిక నిపుణుల పనితనం, సంగీతం,పాటలు అన్నీ చక్కగా అమరడం వలన మంచి విజయాన్ని అందుకుందన్నారు. ఒక్కొక్కరూ నాలుగైదు సార్లు చూస్తున్నారంటే ఈ చిత్రానికున్న ఆదరణ ఎలాంటిదో అర్ధం అవుతోందన్నారు. కలకాలం నిలిచే నాలుగు పాత్రలు పోషించాలని కళాకారుడు కోరుకుంటాడని ఆయన చెబుతూ తన కెరీర్ లోని నాలుగు మంచి పాత్రల్లో మహానటిలోని కెవి చౌదరి పాత్ర నిలిచిపోతుందని ఆనందం వ్యక్తంచేశారు. ఎక్కడికి వెళ్లినా కెవి చౌదరి అని సంబోధిస్తున్నారన్నారు. సావిత్రి నటించిన చిత్రాల్లో మాదిరిగా ఆనాటి ఫోటోగ్రఫీని తలపించేలా స్పెయిన్ కి చెందిన డానియల్ తన కెమెరాతో అందంగా మలిచాడని, ఇక దర్శకుడు నాగ అశ్విన్ రెండేళ్లపాటు పరిశోధించి, ఈ కథను తయారుచేసి జనరంజకంగా తీసాడని ఆయన అన్నారు. దర్శకుడు నాగ అశ్విన్ మాట్లాడుతూ మహానటి సావిత్రి జీవిత కథను సినిమాగా తీసే అదృష్టం దక్కిందని, అందుకే ఈ చిత్రాన్ని ఓ బాధ్యతగా చేశామని అన్నారు. తపించి తీసిన ఈ సినిమాకు మంచి ఆదరణ ఇస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సావిత్రి సినిమా జీవితం ముగిసి నాలుగు దశాబ్దాలు అవుతున్నా ఆమె శక్తి, ఆమెపై ఉన్న ప్రజాదరణ ఏమిటో ఈ చిత్రం నిరూపించిందన్నారు. ఆమె జీవితాన్ని రెండున్నర గంటల్లో సినిమాగా తీయడం కష్టమేనని అయితే అంతకు ముందు చాలామంది సావిత్రి మీద చేసిన పరిశోధనలు, రాసిన కథలు అన్నీ క్రోడీకరించి సినిమాగా మలిచామన్నారు. నిర్మాత ప్రియా దత్ మాట్లాడుతూ ఎలా ఉంటుందో ఏమో అని ఆలోచించకుండా, ఈ సినిమా ఓ బాధ్యతగా తీశామని,రకాల వ్యాఖ్యానాలు వచ్చినా సరే అనుకున్న మేరకు చిత్రం పూర్తిచేశామని, అందుకు తగ్గట్టుగా ఈ చిత్రానికి అనూహ్య ఆదరణ లభిస్తోందని ఆనందం వ్యక్తంచేశారు. కెమెరామన్ డానియల్ మాట్లాడుతూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందన్నారు. మహానటి పాత్రధారి కీరి సురేష్ మాట్లాడుతూ దర్శకుడు నాగ అశ్విన్,ఫొటోగ్రఫీ డానియల్ ,ఇతర నటీనటులు,సాంకేతిక నిపుణులు అందరూ టీమ్ వర్క్ గా చేసిన కృషి వల్లనే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చి బ్లాక్ బస్టర్ అయిందని అన్నారు. ఈ చిత్రంలో పెదనాన్న పాత్రలో నాన్నగా పిలిపించుకుంటూ నటించిన రాజేంద్ర ప్రసాద్ నిజంగానే నాన్నలా ఎన్నో సలహాలు ఇచ్చి ప్రోత్సహించారని చెప్పారు. గీతా ఫిలిమ్స్ శాస్త్రి, స్వామి థియేటర్ అధినేత పులవర్తి లక్ష్మణ స్వామి, సూర్య ధియేటర్ అధినేత సుబ్బరాజు, సురేష్ మూవీస్ రమేష్, ఇష్ణా ఫిలిమ్స్ రాజు , రంగయ్య, శ్రీదేవి కన్ స్ట్రక్షన్స్ మేనేజర్ చీకట్ల సత్యనారాయణ, విష్ణు, కె సత్యనారాయణ, ఫోకస్ రెడ్డి, అనుశ్రీ హరిబాబు, రౌతు రవీంద్ర, రవి, వెంకటేశ్వరరావు, ఇంకా పలువురు డిస్ట్రిబ్యూటర్లు, మేనేజర్లు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం