శ్రీలంకలో రాజ్యాంగ సంక్షోభం


శ్రీలంక రాజ్యాంగ సంక్షోభం దిశగా పయనిస్తోంది. అధ్యక్షుడు సిరిసేన ప్రధాని రణిల్‌ విక్రమసింఘే మధ్య వివాదం తీవ్రమై పార్లమెంట్‌ రద్దుకు దారితీసింది. శనివారం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో రాజకీయ సంక్షోభాన్ని గమనించి ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం ప్రధాని రణిల్‌ విక్రమసింఘేకు అధ్యక్షుడు సిరిసేన ఉద్వాసన పలికారు. మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సెను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. ఈ మేరకు హడావుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని ఆర్థిక మంత్రి మంగళ సమరవీర మండిపడ్డారు. ఈ నేపథ్యంలో విక్రమసింఘే అధికారిక నివాసాన్ని ఖాళీచేయలేదు. తాను ఇంకా పదవిలోనే ఉన్నానంటూ అధ్యక్షుడికి లేఖ రాశారు. తనను పార్లమెంట్‌ ద్వారా మాత్రమే తొలగించగలరని లేఖలో పేర్కొన్నారు. తమ పార్టీకి పూర్తి మెజార్టీ ఉందన్నారు. విక్రమసింఘే నేతృత్వంలోని ఐక్య ప్రభుత్వం 2015లో ఏర్పడింది. శుక్రవారం అర్ధరాత్రి జాతీయ ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ‘‘ నేను ప్రధాన మంత్రి హోదాలో మీతో మాట్లాడుతున్నాను. నేను ప్రధానిగానే కొనసాగుతాను. ప్రధానిగానే పనిచేస్తాను’’ అని పేర్కొన్నారు. దీంతో శనివారం రాజీనామా చేయాలని రణిల్‌ విక్రమసింఘేకు అధ్యక్షుడు సిరిసేన నోటీసు జారీ చేశారు. ప్రతిగా బలనిరూపణ చేసుకొనేందుకు పార్లమెంట్‌ సమావేశం నిర్వహించాలని రణిల్‌విక్రమసింఘే డిమాండ్‌ చేశారు. అంతే కాక ఈ మేరకు పార్లమెంట్‌ స్పీకర్‌ కరు జయసూర్యాకు లేఖ రాశారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే పార్లమెంట్‌ను రద్దుచేస్తూ అధ్యక్షుడు సిరిసేన ఆదేశాలు జారీ చేశారు. కొద్దిరోజులుగా సిరిసేనకు, విక్రమసింఘేకు మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. తనను, రాజపక్సె సోదరుడు గోతభయ రాజపక్సెను హత్య చేయడానికి జరిగిన కుట్రను యూఎన్‌పీ తీవ్రంగా పరిగణించలేదని సిరిసేన ఆరోపించినట్లు సమాచారం.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం