ఇండియాకు పెద్దఎత్తున దొంగబంగారం


భారతదేశానికి బంగారం అక్రమ రవాణా పెద్దఎత్తున జరుగుతోంది.ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులనుంచి ఈ అక్రమ రవాణా సాగుతోంది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ కూడా దీనిని గుర్తించింది. ఈ ప్రాంతంలో 98శాతం సరిహద్దులు నాలుగు దేశాల వెంట ఉన్నాయి. శనివారం సిలిగురి వద్ద ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి 55 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సీజ్‌ చేసిన బంగారం 353 కిలోలకు పైమాటే. గత ఏడాది 430 కిలోల బంగారాన్ని అధికారులు, భద్రతా దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. దీని విలువ రూ.110 కోట్ల పైనే. ప్రస్తుతం మార్కెట్లో బంగారం కిలో దాదాపు రూ.32లక్షలు పలుకుతోంది. అక్రమ బంగారం ధర తక్కువగా ఉండటంతో చాలా మంది దీనిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కిలో బంగారం స్మగ్లింగ్‌ చేస్తే రూ.5లక్షల వరకు మిగులుతున్నదని అంచనా. మయన్మార్‌కు చెందిన కొందరు స్మగ్లర్లు చైనా నుంచి బంగారం భారత్‌కు తరలిస్తు న్నారు. ఈశాన్య భారతదేశంలోని సరిహద్దులు, పశ్చిమ్‌బంగా‌లోని కొన్ని సరిహద్దుల నుంచి దేశంలోకి ఈ బంగారం వస్తోంది. మయన్మార్‌, చైనా, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లతో ఈ ప్రాంతం సరిహద్దులను పంచుకుంటోంది. ఇక్కడనుంచి బంగారాన్ని మధ్యవర్తులు రోడ్డు, రైలు, వైమానిక మార్గాల్లో దిల్లీకి చేరుస్తున్నారు. దిల్లీ వరకు వెళ్లడం రిస్క్‌ అనుకున్న వారు కోల్‌కతాలోని బారాబజార్‌లో అమ్ముతున్నారు. దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలోని వినియోగదారులకు ఈ బంగారం చేరుతోంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం