కాశ్మీర్ లో అలజడికి అసలు కారణం


జమ్ముకశ్మీర్‌ విషయంలో భారత్‌పై విజయం సాధించలేమని పాకిస్థాన్‌కు స్పష్టంగా అర్థమైందని, అందుకే ఆ ప్రాంతంలోకి ఉగ్రవాదులను ప్రవేశపెట్టి అలజడి సృష్టించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నదని భారత సైన్యాధిపతి బిపిన్‌ రావత్‌ అన్నారు. శుక్రవారం రాత్రి జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో సరిహద్దు రోడ్ల సంస్థ (బీఆర్‌వో)కు చెందిన కాన్వాయ్‌పై ఓ గుంపు రాళ్లతోదాడి చేసింది. ఈ ఘటనలో జవాను రాజేంద్ర సింగ్‌ (22) ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పాక్‌పై బిపిన్‌ రావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘భారత్‌పై ఎన్నటికీ విజయం సాధించలే మని పాక్‌ గ్రహించింది. కశ్మీర్‌లో అలజడి సృష్టించడానికి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే వారికి ఉన్న ఏకైక మార్గం. కశ్మీర్‌లో అభివృద్ధిని అడ్డుకోవాలని అనుకుంటోంది. కానీ, వారి ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టగలిగే సామర్థ్యం భారత్‌కు ఉంది. అందుకోసం అన్ని రకాల ఆపరేషన్‌లను సమర్థవంతంగా నిర్వహిస్తాం. రాళ్లు రువ్వే వారిని ఉగ్రవా దులకు సాయం అందించేవారుగా చూడొద్దంటూ కొందరు సూచిస్తున్నారు... ఇది సరైంది కాదు’ అని బిపిన్‌ రావత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యాంశాలు