95శాతం హామీలు నెరవేర్చామన్న వసుంధర

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2013 మ్యానిఫెస్టోలో ఇచ్చిన 665 హామీల్లో 630 హామీలను నెరవేర్చిందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజె వెల్లడించారు. మంగళవారం జైపూర్‌లో పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాజెతో పాటు కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, ప్రకాశ్‌ జావడేకర్‌లు, ఇతర భాజపా నేతలు పాల్గొన్నారు. భాజపా ఈసారి నిరుద్యోగులు, ఉద్యోగ కల్పనపై ఎక్కువ దృష్టి పెట్టింది. మ్యానిఫెస్టో విడుదల చేసిన అనంతరం రాజె మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో సుపరిపా లనకు తాము కట్టుబడి ఉన్నామని, ఇచ్చిన హామీల్లో 95శాతం నెరవేర్చగలిగాం అన్నారు. ప్రభుత్వం రూ.80వేల కోట్ల రుణాలు ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు ‘బేటీ పడావో’పై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. రానున్న ఐదేళ్లలో రాజస్థాన్‌లో ప్రైవేటు సెక్టార్‌లో 50లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాజె హామీ ఇచ్చారు. ఏటా ప్రభుత్వ రంగంలో 30వేల ఉద్యోగాలిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. 21ఏళ్లు పైబడిన అర్హులైన యువతకు నెలకు రూ.5వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోందని అన్నారు. ప్రతి గ్రామంలో విద్యుత్‌ సదుపాయం కల్పించామన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వసుంధర రాజె ప్రభుత్వానికి కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు సానుకూల అంశంగా మారుతుందని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. రాజస్థాన్‌లో డిసెంబరు 7న పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 11న ఫలితాలు వెలువడనున్నాయి.