శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి సన్నాహాలు

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల నిర్వహణకు తిరుమల దివ్యక్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు పెద్దఎత్తున జరుగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి 12.05 నుంచి వరుసగా స్వామివారికి కైంకర్యాలు జరగనున్నాయి. తిరుప్పావై పఠనంతో శ్రీవారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, శుక్రవారాభిషేకం ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం వైకుంఠ ద్వారాలను శాస్త్రోక్తంగా తెరుస్తారు. ఉదయం 5 నుంచి  ప్రొటోకాల్‌, వీఐపీ దర్శనాలు మొదలు పెట్టి 7 గంటల తర్వాత ధర్మదర్శనాన్ని ప్రారంభిస్తారని అంటున్నారు. అయితే గత అనుభవాలను బట్టి 10 గంటల వరకూ విఐపి సేవలతోనే స్వామివారు బందీ అవుతారని సామాన్య భక్తులు భయపడుతున్నారు. వైకుంఠ ద్వారం గుండా స్వామి దర్శనం చేసుకోవాలనే ఆశతో లక్షలాదిగా తిరుమలకు భక్తులు తరలివస్తున్నారు. భక్తులను గురువారం ఉదయం 10 గంటల నుంచి క్యూలైన్లలోకి అనుమతిస్తారు. వైకుంఠం-2లోని అన్ని కపార్ట్‌మెంట్లు నిండిన అనంతరం నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన కంపార్ట్‌మెంట్లలో యాత్రికులను నింపుతారు. కొత్తగా 4 కిలోమీటర్ల పొడవున రెండు వరుసల్లో నిర్మించిన క్యూలైన్లలోకి భక్తులను పంపుతారు. గురువారం రాత్రికి క్యూలైన్లన్నీ నిండిపోతాయని భావిస్తున్నారు. కాగా  దేశం నలు మూలలనుంచీ పలువురు ప్రముఖులు వసున్నారని తితిదే వర్గాలు చెబుతున్నాయి. వారి కోసం గదులను రిజర్వు చేసారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్వర్ణ రథోత్సవం, ద్వాదశి వేకువ జామున చక్రస్నానం జరుగుతాయి.