29 న  ట్రైన్‌ 18 ని ప్రారంభించనున్న మోదీ

భారత్‌లో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ట్రైన్‌ 18. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల ట్రయల్‌రన్‌ పూర్తి చేసుకున్న వీడియోను షేర్ చేస్తూ ఈ ట్రైన్‌ 18 గంటలకు 180 కి.మీ. వేగాన్ని అందుకుంది. భారత్‌లో అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా రికార్డు సృష్టించింది’ అని ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది నవంబరులో ట్రైన్‌ 18ను తొలిసారి బరేలి నుంచి మొరదాబాద్‌ వరకూ నడిపి పరీక్షించారు. అనంతరం ఈనెల మొదటి వారంలో రాజస్థాన్‌లోని కోట నుంచి సవోయ్‌ మాధోపూర్‌ వరకూ రెండోసారి ట్రయల్‌రన్‌ నిర్వహించారు. ఇంత వేగంలోనూ రైల్లోని వాటర్‌ బాటిల్‌ కూడా కదల్లేదని, రైలు తయారీలో పాటించిన నాణ్యతకి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 
రూ.100 కోట్ల వ్యయంతో 18 నెలల కాలంలో చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్‌)లో దీన్ని తయారు చేశారు. ఈనెల 29న ప్రధాని నరేంద్రమోదీ వారణాసి-దిల్లీ రూట్‌లో దీన్ని ప్రారంభించనున్నారు. ఈ రైలులో జీపీఎస్‌ వ్యవస్థ ఆధారంగా ఎప్పటికప్పుడు స్టేషన్‌ వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. తలుపులు స్టేషన్‌లో మాత్రమే ఆటోమేటిక్‌గా తెరుచుకునేలా తయారు చేసారు. ఉదయం దిల్లీలో 6గం.లకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు వారణాసి వెళుతుంది. తిరిగి మధ్యాహ్నం 2.30గంటలకు వారణాసిలో బయలుదేరి అదే రోజు రాత్రి 10.30గం.లకు ఢిల్లీ చేరుతుంది. అంటే 755 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 8 గంటల్లో చేరుతుందన్నమాట.  ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్‌ కంపార్ట్‌ మెంట్లు ప్రత్యేకం. వీటిలో ఒక్కో దానిలో 52సీట్లు ఉంటాయి. సీట్లు దిశ మార్చుకునే సదుపాయముంది. ఇతర కంపార్ట్‌మెంట్‌లలో 78 సీట్లు ఉంటాయి. బయో వాక్యూమ్‌ టాయిలెట్స్‌, ఎల్‌ఈడీ లైట్లు, మొబైల్‌ ఛార్జింగ్‌పోర్ట్‌లు, క్లైమటైజర్ వంటి సదుపాయాలున్నాయి. 

Facebook