టైగర్‌ ఎస్టిమేషన్‌ -2018 (Tiger Census)


రాజమహేంద్రవరం లోని దివాన్‌చెరువు గ్రామపరిధిలో ఉన్న ఎపి రాష్ట్ర అటవీ అకాడమీ ప్రాంగణంలో శనివారం నాడు అటవీ రేంజి కార్యాయాల్లో పనిచేసే డాటా ఆపరేటర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఆల్‌ ఇండియా టైగర్స్‌ ఎస్టిమేషన్‌-2018 లో భాగంగా ఎం- స్ట్రైప్స్‌ విధానంలో డాటా నమోదుకు అనుసరించాల్సిన విధానంపై వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డెహ్రాడూన్‌) నుంచి వచ్చిన ట్రెయినర్‌ అశోక్‌ వారికి శిక్షణ ఇచ్చారు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా పులుల అంచనా కార్యక్రమం సాగుతుందని, చివరిసారిగా ఈ కార్యక్రమం 2014లో జరిగిందని ఎపి రాష్ట్ర అటవీ అకాడమీ ఉపసంచాలకులు వైఎస్‌ నాయుడు, ఫ్యాకల్టీ మెంబర్‌ పి ఉదయ్‌శంకర్‌, వైల్డ్‌ లైఫ్‌ సైంటిస్ట్‌ బాలాజీ తెలిపారు. ఈ దఫా టైగర్‌ ఎస్టిమేషన్‌ కార్యక్రమం ఆండ్రాయిడ్‌ ఫోన్ల ద్వారా జిపిఎస్‌, లైవ్‌ ట్రాకింగ్‌, కెమెరా ట్రాప్స్‌ వంటి పద్ధతులో పూర్తి అధునాతన విధానాల్లో జరిగిందన్నారు. పులుల ఆనవాళ్ళనే కాకుండా ఆయా అరణ్యప్రాంతాల్లోని పర్యావరణ, వాతావరణ, భూ స్థితిగతులను కూడా ఈ సర్వేలో అటవీసిబ్బంది నిశితంగా పరిశీలించి నమూనాలు, ఆనవాళ్ళు, ఇతర చిహ్నాలు, ఛాయాచిత్రాల రూపంలో సమాచారం సేకరించారన్నారు. మన రాష్ట్రంలో ఈనె 22 నుంచి 28వ తేదీ వరకూ టైగర్‌ ఎస్టిమేషన్‌ కార్యక్రమాన్ని ఫారెస్టు గార్డులు శాస్త్రీయ విధానంలో నిర్వహించారని పేర్కొన్నారు. వారు సేకరించిన వివరాలు, సమాచారాన్ని నిర్ణీత పద్ధతి ప్రకారం డాటాగా రూపొందించి పంపాల్సి ఉందని తెలిపారు. ఎం స్ట్రైప్స్‌లో డాటా నమోదు విధానాన్ని ఆయన ప్రయోగాత్మకంగా ఆపరేటర్లకు వివరించారు. రేంజి కార్యాలయాల స్థాయిలో సేకరించిన వివరాలన్నిటినీ ఎంస్ట్రైప్స్‌లో నమోదు చేసి శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌కు పంపిస్తారని, అక్కడినుంచి రాష్ట్రసమాచారం మొత్తం క్రోడీకరించి ఫిబ్రవరి నెలాఖరులోగా ఢల్లీిలోని జాతీయ పులుల సంరక్షణ విభాగానికి (ఎన్‌టిసిఎ) పంపడం జరుగుతుందని వెల్లడించారు. ఇలా అన్ని రాష్ట్రాల సమాచారాన్ని మదింపు చేసిన తర్వాత డెహ్రాడూన్‌ లోని భారతీయ వన్యప్రాణి విభాగం (వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా)కి చేరుస్తారన్నారు.

ముఖ్యాంశాలు