అసలైన గెలుపు


గుజరాత్ లో బీజేపీ తిరిగి విజయం సాధించడం, కాంగ్రెస్ పార్టీ నుంచి హిమాచల్ ప్రదేశ్ ను స్వాధీనం చేసుకోవడం ప్రధాని నరేంద్ర మోదీ ఘనతగా చెప్పడానికి కొందరు రాజకీయ, మీడియా విశ్లేషకులు అంగీకరించడం లేదు. తమదైన వక్రభాష్యాలు జోడించి గందరగోళం చేస్తున్నారు. నా దృష్టిలో మాత్రం ఇది అసలైన విజయం. ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న వేళ ప్రతిపక్షాలతో పాటు కొన్ని వర్గాలు పెద్ద ఎత్తున దుష్ప్రచారం మొదలు పెట్టాయి. పెద్ద నోట్ల రద్దును స్వాగతించే మనస్థత్వం లేక చిన్న చిన్న కష్టాలను భూతాలుగా చూపి ప్రజలకు నష్టం జరిగిపోతున్నట్లు తప్పుదోవ పట్టించాయి. జీఎస్టీ విషయంలో కూడా ఇదే వైఖరిని ప్రదర్శించాయి. ఇదే సమయంలో మోదీజీ సొంత రాష్ట్రం గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు రావడం వారికి ఆయుధంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నోట్ల రద్దు, జీఎస్టీలనే ప్రధాన ఎజెండాగా స్వీకరించింది. మరోవైపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన పాటీదార్ల నాయకుడు హార్ధిక్ పటేల్ ను దువ్విoది. తాము అధికారంలోకి వస్తే పాటీదార్లకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు, ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు ఎన్నో ఇచ్చింది. గుజరాత్ లో రెండు దశాబ్దాలుగా వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, కొన్ని శక్తులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాయి. ఈ పరిణామాలను ఛాలెంజ్ గానే స్వీకరించారు ప్రధాని మోదీ.. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించరాదని, ఎవరైనా ఇలాంటి హామీ ఇస్తే మోస పూరితం అవుతుందని కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు ప్రధాని.. దీన్ని అర్థం చేసుకున్న మెజారిటీ పాటీదార్ వర్గీయులు కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలను నమ్మలేదు. ఇక జీఎస్టీతో ఏర్పడ్డ ఇబ్బందులు పరిష్కరించాలంటే అది కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాతోనే సాధ్యం. కాంగ్రెస్ గుజరాత్ లో గెలిచినా చేతులు ముడుచుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని ఆ రాష్ట్ర వ్యాపార వర్గాలకు తెలుసు. అందుకే ఈ అంశాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. గతంలో మోదీజీని ‘ఛాయ్ వాలా’ అంటూ పరిహసించిన కాంగ్రెస్ పార్టీ, ఈసారి ‘నీచ్’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకే నష్టం చేకూర్చాయి. పైగా గుజరాత్ ఎన్నికల సమయంలో పాకిస్తాన్ నాయకులతో కాంగ్రెస్ పార్టీ జరిపిన రహస్య సమావేశం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాలను ప్రధాని ఎన్నికల ప్రచారంలో ప్రస్థావిస్తే, దాన్ని కూడా తప్పు పట్టే ప్రయత్నం చేశారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఓటింగ్ సరళిని విశ్లేషిస్తే నగరాలు, పట్టణాల ప్రజలు, వ్యాపారులు భాజపాకే ఓటు వేశారు. పాటీదార్లు అధికంగా ఉన్న సౌరాష్ట్ర, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అధికంగా సీట్లు వచ్చాయి. రైతాంగంలో కొంత మేర అసంతృప్తి ఉంది. ఈ లోపాలను సరిదిద్దు కోవడం బీజేపీకి కష్టం కాదు. కాంగ్రెస్ ఉచ్చులో పడి హార్దిక్ పటేల్ మోసపోయాడు. అదే సమయంలో పాటీదార్ల రిజర్వేషన్లకు వ్యతిరేకమైన దళిత నేత జిగ్నేష్ మేవానీ, ఓబీసీ నేత అల్పేష్ ఠాగూర్ కాంగ్రెస్ పార్టీలో ఒప్పందం కుదుర్చకొని ఎమ్మెల్యేలుగా గెలిచారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి తగ్గట్టే గుజరాతీ ప్రజలు ఓటు ఇచ్చి సత్కరించారు. మరోసారి బలమైన ప్రతిపక్షంగా గెలిపించారు. పాపం రాహుల్ గాంధీ గుళ్లూ, గోపురాలు తిరిగి హిందూ ఓటు బ్యాంకును పొందేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. గుజరాత్ లో బీజేపీ గెలిచినా సీట్లు తగ్గాయి. కానీ ఇది ప్రధాని మోదీజికి నిజమైన గెలుపు. ఆయన చేపట్టిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లాంటి సంస్కరణలను గుజరాతీ ప్రజలు స్వాగతించారు అనే ఫలితాలు చెబుతున్నాయి. కాబట్టి మోదీజీ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు మాయాజాలంలో పడకుండా నిరభ్యంతరంగా ముందుకు సాగవచ్చు.. అదే సమయంలో గుజరాత్ ఫలితాలను అధ్యయనం చేసి కాంగ్రెస్ ముక్త్ భారత్ దిశగా వ్యూహాలకు పదును పెట్టుకోవచ్చు.. సో.. మోదీజీ ఆగే బడో.. ఇస్ దేశ్ ఆప్ కే సాథ్ హై.. -క్రాంతి దేవ్ మిత్రా , హైదరాబాద్

ముఖ్యాంశాలు