ఆ మహిళల పట్ల పాక్ తీరు అమానుషం

కుల్భూషణ్ జాదవ్ భార్య, తల్లి పట్ల పాకిస్థాన్ తీరు అత్యంత అమానుషమని.. ఇది మానవత్వం ఉన్నవారంతా తలా దించుకునే సంఘటన అని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆవేదన వ్యక్తం చేసారు. జాదవ్-కుటుంబసభ్యుల భేటీ పరంగా పాక్ అమానుష ప్రవర్తనపై ఆమె గురువారం రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆమె పాక్ తీరును ఎండగట్టారు. జాదవ్ కుటుంబసభ్యుల భావోద్వేగ కలయికను పాక్ ప్రచార సాధనంగా మలుచుకుందని ధ్వజమెత్తారు. ‘జాదవ్ తల్లి, భార్య చేత బొట్టు, మంగళసూత్రం, గాజులు తొలగింపజేశారు... చివరికి అతడి భార్య దుస్తులు కూడా మార్పించారు. జాదవ్ తల్లి ఎప్పుడూ చీరలే ధరిస్తారు.. కానీ పాక్ అధికారులు ఆమెను బలవంతపెట్టి కుర్తా-సల్వార్ ధరింపజేశారు. ఇదెక్కడి మానవత్వం.. ఇదెక్కడి నిబంధన.. అంటూ సుష్మా మండిపడ్డారు. తల్లిని, నానమ్మను చూడగానే జాదవ్ మొట్టమొదట అడిగిన ప్రశ్న ‘నాన్న ఎలా ఉన్నారు?’ అని. తల్లిని అలా చూసి దిగ్భ్రాంతికి గురైన ఆ అబ్బాయి జాదవ్ కి చెడు జరిగిందేమోనని భయపడ్డాడని అతడి భార్య తనతో చెప్పిందని మంత్రి తెలిపారు. మానవతా దృక్పథంతో ఈ భేటీకి అనుమతినిచ్చామని పాక్ చెబుతోంది.. అయితే ఆ కుటుంబసభ్యుల కనీస హక్కులను పాకిస్థాన్ అనేకసార్లు ఉల్లంఘించిందని, ఓ భయానక వాతావరణాన్ని కల్పించిదని సుష్మాస్వరాజ్ అన్నారు. పాక్ అధికారులు జాదవ్ భార్య చెప్పులను కూడా స్వాధీనం చేసుకున్నారని.. అవి మళ్ళీ ఇవ్వనేలేదని తెలిపారు. వాటిలో కెమెరా రికార్డింగ్ చిప్ ఉందని పాక్ బుకాయిస్తున్నదని.. అయితే అవే చెప్పులతో రెండు విమానాల్లో జాదవ్ భార్య ప్రయాణించారని సుష్మ స్వరాజ్ గుర్తు చేసారు. జాదవ్ తల్లిని తమ మాతృభాష మరాఠీలో కూడా మాట్లాడనివ్వలేదన్నారు. అలా మాట్లాడినపుడల్లా ఇంటర్కమ్ను ఆపివేశారన్నారు. "పాక్ అభ్యంతరకర ప్రవర్తనను మనం తీవ్రంగా ఖండించాలి" అని సుష్మా చెప్పారు. జాదవ్ మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానంలో స్టే తీసుకురాగలిగామని, ఏదోవిధంగా అతడిని విడిపించేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా శ్రమిస్తోందని చెప్పారు.