భారత్ ను పీడిస్తున్న చైనా కమ్యూనిజం ప్రేతాత్మ


పిల్ల చచ్చినా పురిటి కంపు చావలేదు అన్నట్లు చైనాలో కమ్యూనిజం చచ్చినా దాని ప్రేతాత్మ భారత కమ్యూనిస్టులకు ఆరాధనీయంగానే కనిపిస్తోంది. భారత దేశానికి చైనా శత్రువని చిన్న పిల్లవాన్ని అడిగినా చెబుతాడు. అయినా సిగ్గు లేకుండా చైనా భజన చేస్తున్నారు సీపీఎం నాయకులు.. ముఖ్యంగా కేరళ సీఎం పినరయ్ మన దేశానికి వ్యతి రేకంగా, చైనాకు అనుకూలంగా చేసిన భజనకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పుకోవా ల్సిందే.. చైనా పేరుకు మాత్రమే కమ్యూనిస్టు దేశం.. కానీ అక్కడ ఆచరణలో ఉన్నది మాత్రం పెట్టుబడిదారీ వ్యవస్థ.. ప్రజాస్వామ్యం లేదు.. ఎన్నికలు ఉండవు. ఏక పార్టీ వ్యవస్థ ఉన్న నియంతృత్వ దేశం.. చైనాలో కార్మిక చట్టాలు పేరుకు మాత్రమే.. కనీస వేతనాలు ఇవ్వరు.. కార్మికులు 10-12 గంటల గొడ్డు చాకిరీ చేస్తారు. మన దేశంలో కార్మిక ఉద్యమాలమీదే బతికే కమ్యూనిస్టులు కార్మిక వ్యతిరేక చైనాను ఎలా సమర్ధిస్తున్నారు? అమెరికా, ఇజ్రాయిల్ దేశాలను కాకుండా గుంట నక్క చైనానే మన దేశం విశ్వసించాలని సీపీఎం నాయకులు భావిస్తున్నారా?.. మన దేశ ప్రయోజనాలకు పూర్తి వ్యతిరకేకమైన చైనాను తెలివున్న వాడెవడూ సమర్ధించడు.. చైనాలో కమ్యూనిస్టు పాలన ఏర్పడింది మొదలు నేటి వరకూ మన దేశానికి వ్యతిరేకంగానే పని చేస్తోంది. పంచశీల ఒప్పందానికి తూట్లు పొడచి భారత దేశంపై దండెత్తిన నీతి లేని చరిత్ర ఆ దేశానిది. అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చెరబట్టడం, తాజాగా డోక్లామ్ లో దురాక్రమణ చరిత్ర లోకానికి తెలియనిది కాదు. అంతే కాదు లద్దాక్, అరుణాచల్ సహా సరిహద్దుల్లో మనతో కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా.. బ్రహ్మపుత్ర నది మన దేశంలోకి రాకుండా దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తోంది. మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను చేపట్టిన పాకిస్తాన్ కు సిగ్గు లేకుండా మద్దతు ఇస్తూ, వివాదాస్పద ఆక్రమిత కాశ్మీర్ మీదుగా ‘సీపీఈసీ’ కారిడార్ నిర్మిస్తోంది. పాకిస్తాన్ లో ఉంటూ భారత దేశంలో ఉగ్రవాద దాడులను నిర్వహించిన మౌలానా మసూద్ అజర్ ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రయత్నాలకు మోకాలడ్డుతోంది. భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, మయాన్మార్ దేశాల్లో వ్యాపార, సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. 1962 చైనా యుద్ద సమయంలో మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ సీపీఐ, సీపీఎంగా చీలిపోయింది. ఒకరు రష్యా, మరొక్కరు చైనాకు ఉపగ్రహాలుగా మారారు. చైనా మన దేశంపై దండెత్తడాన్ని సిగ్గు లేకుండా స్వాగతించింది సీపీఎం. నాటి నుంచి నేటి వరకూ సీపీఎం నీతి మారలేదు. తాజాగా ఉత్తర కొరియా నియంత కిమ్ భజనలు కూడా మొదలు పెట్టారు కేరళ సీపీఎం నాయకులు. భారత దేశంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తూ నియంతృత్వ చైనాను కీర్తించడంలో ఏమైనా అర్థం ఉందా? అడుగడుగునా భారత దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చైనాకు వత్తాసు పలకడం దేశ ద్రోహం కాదా?.. ఇందుకు సీపీఎం పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలి. - క్రాంతిదేవ్ మిత్రా, హైదరాబాద్

ముఖ్యాంశాలు