మహిళామణులకు ప్రధాని మోదీ ప్రశంసలు


మహిళా సాధికారత దేశాభ్యున్నతికి కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం 'మన్ కీ బాత్' కార్యక్రమంలో పునరుద్ఘాటించారు. మహిళా సాధికారత, జెనరిక్ మందుల ప్రచారం 'జన్ ఔషిధి యోజన', పద్మ అవార్డుల అంశాలను తాజా రేడియో ప్రసంగంలో ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ' ఈరోజు బేటీ బచావో బేటీ పడావో గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఏళ్ల క్రితమే మన పవిత్ర గ్రంథాలు ఒక కుమార్తె పది మంది కుమారులతో సమానమని చెప్పాయి' అని ప్రధాని అన్నారు. వ్యోమగామి కల్పనా చావ్లా విజయాలను గుర్తు చేస్తూ, ఈ గడ్డలో పుట్టిన ఆడపిల్లల శక్తికి ఆమె ఓ మంచి ఉదాహరణగా నిలిచారని, కుమార్తెలు తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదని ఆమె నిరూపించారని కొనియాడారు. మహిళలు ఎన్నో రంగాల్లో పురోగమిస్తున్నారనడానికి 42 మంది మహిళా సిబ్బందితో కూడిన ముంబైలోని మాతుంగ రైల్వే స్టేషన్‌ను ఆయన ఉదహరించారు. దేశ విదేశాల్లో నారీ శక్తి కీలక భూమిక పోషిస్తోందన్నారు. సుఖోయ్-30 నడపడంలో ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్లు-భావ్నా కాంత్, మోహన సింగ్, అవని చతుర్వేది శిక్షణ పొందుతున్నారని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత దంతేవాడలో గిరిజన మహిళలు ఇ-రిక్షాలు నడుపుతూ తమ కాళ్ల మీద తాము నిలబడుతున్నారని ప్రశంసించారు. జన్ ఔషధి యోజన' ద్వారా సబ్సిడీ రేటల్లో మందులు దేశప్రజలకు అందుబాటులోకి తెచ్చామని మోదీ తెలిపారు. ఈ స్కీమ్ కింద 3000కు పైగా మందులు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు లక్ష్మీకుట్టి, సుహాసిన మిస్త్రీ, అరవింద్ గుప్తాలను కూడా ప్రధాని మోదీ ప్రశంసించారు.

ముఖ్యాంశాలు