తెలంగాణకు రూ.3,500 కోట్ల యుఎఇ పెట్టుబడులు

యూఏఈ పారిశ్రామిక సంస్థలు లులు గ్రూపు, బీఆర్ శెట్టి గ్రూపు తెలంగాణలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చాయి. ఆదివారం అబుదాబీ, దుబాయ్‌ల్లో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ మేరకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దావోస్ పర్యటన అనంతరం యూఏఈకి వచ్చిన మంత్రి కేటీఆర్, ఇతర ప్రతినిధి బృందం ఈ సంస్థలతో సమావే శమయింది. అబుదాబీలో లులు గ్రూపుతో మూడు ఒప్పందాలు (ఎంవోయూలు) జరిగా యి. వీటిపై తెలగాణ పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, లులు గ్రూపు సీఈవో సైఫీ రూపవాలా సంతకాలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ రిటైల్, ఆహారశుద్ధి రంగాల్లో పేరొందిన లులు గ్రూపు రూ.2,500 కోట్లతో మెదక్ జిల్లాలో కూరగాయల శుద్ధి పరిశ్రమను, రంగారెడ్డి జిల్లాలో ఆహారశుద్ధి పరిశ్రమను, హైదరాబాద్‌లో 1.8 మిలియన్ చదరపు అడుగుల్లో భారీ దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేస్తుంద ని చెప్పారు. వీటి ద్వారా ఆరు వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. సంస్థ ఛైర్మన్ యూసఫ్ అలీ మాట్లాడుతూ భారత్‌లో తమ వ్యాపార విస్తరణ కోసం ఈ రాష్ట్రాన్నే ఎంచుకున్నామని చెప్పారు. అనంతరం దుబాయ్‌లో బీఆర్ శెట్టి గ్రూపు సంస్థతోనూ అవగాహన ఒప్పందం కుదిరింది. జయేశ్‌రంజన్, బీఆర్ఎస్ సంస్థ ప్రతినిధి సంతకాలు చేశారు. ఈ సమావేశంలో కేటీఆర్, బీఆర్ఎస్ వెంచర్స్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ బీఆర్ శెట్టి పాల్గొన్నారు. తాము తెలంగాణలో రూ.వేయి కోట్ల పెట్టుబడులతో మూడు నుంచి అయిదేళ్లలో మూడు ప్రాజెక్టులను నిర్మిస్తామన్నారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఔషధ పరిశ్రమ, పరిశోధన, అభివృద్ధి కేంద్రం, సుల్తాన్‌పూర్‌లోని పార్కులో మరో 20 ఎకరాలతో వైద్యపరికరాల తయారీ సంస్థ, మరో 50 ఎకరాల్లో 500 పడకలతో గ్రీన్‌ఫీల్డ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పుతామన్నారు. వీటి ద్వారా నాలుగువేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.