జీశాట్‌-6ఎ ప్రయోగానికి సాగుతున్న కౌంటింగ్


భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి గురువారం సాయంత్రం 4.56 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌08 వాహకనౌక అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. అది దేశ కమ్యూనికేషన్స్‌ రంగానికి ఊపు నిచ్చే జీశాట్‌-6ఎ ఉపగ్రహాన్ని నింగిలో ప్రవేశపెట్టనుంది. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్‌డౌన్‌ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం 1.56 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 27 గంటలపాటు కొనసాగుతుంది. ప్రయోగ వేదిక నుంచి రాకెట్‌ బయలుదేరిన తర్వాత 17.46 నిమిషాలు పాటు పయనించి ఉపగ్రహాన్ని పెరొజి(భూమికి సమీప కక్ష్య) 170 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరపు కక్ష్య) 35,975 కిలోమీటర్ల ఎత్తులో వదిలిపెట్టనుంది. ఇస్రో అధిపతి డాక్టర్‌ కె.శివన్‌ బుధవారం మధ్యాహ్నం షార్‌కు చేరుకున్నారు. ప్రయోగ వివరాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రయోగ వీక్షణకు వీఐపీలు ఎవరూ రావడం లేదు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈఏడాది పది రాకెట్‌ ప్రయోగాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ అధిపతి డాక్టర్‌ కె.శివన్‌ పేర్కొన్నారు. ఆయన బుధవారం ఎన్‌ఆర్‌ఎస్‌ఏ సంచాలకులు కృష్ణమూర్తితో కలిసి సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ఏడాది పది రాకెట్‌ ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపారు. వచ్చేనెల 12వ తేదీ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఉప్రగహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సి41 వాహకనౌక ద్వారా కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నట్లు వివరించారు.

ముఖ్యాంశాలు