తెలు-గోడు


ఓ తెలుగువాడా... ప్రత్యేకించి ఆంధ్ర పౌరుడా? యద్భావం తద్భవతి... రౌతు కొద్దీ గుర్రం.. పిండి కొద్దీ రొట్టె ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో.. ఆ ఇంటికి ఈ ఇల్లూ అంతే దూరం.. నువ్వు ఇచ్చినదే నీకు వస్తుంది పుణ్యం కొద్దీ పురుషులు.. దానం కొద్దీ బిడ్డలు! ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు...! నువ్వేమీ అక్కున చేర్చుకోని.. ఎప్పుడూ విశ్వసించని... కలలో కూడా అధికారంలోకి వస్తుందని నువ్వు అనుకోని... నీకేమీ కాని.... నువ్వెప్పుడూ నెత్తిన పెట్టుకుని మోయని... ఆ ఉత్తరాది పార్టీ బిజెపి.... నీకు అంతా అయిపోయి... అన్నివిధాలా నిన్ను ఆదుకుంటుందని ఎలా నమ్మావు? ఎన్నికల్లో ప్రతి పార్టీ బోలెడు చెబుతుంది... బిజెపి రెండు మాటలు చెబితే చంద్రబాబు వందలాది వాగ్దానాలు చేసారు. వైకాపా కూడా వందల మాటలు చెప్పింది. ఓట్లను బట్టి బాధ్యత ఉండదని.. అధికారం ఇస్తేనే పని చేస్తారా? అనీ నీతులు ఎవరూ చెప్పకండి. ఇది రాజకీయం. తమకు అధికారం వస్తుందని ఆశ ఉంటే.. లేదా అధికారం వస్తే వాటిని నిలుపుకోవడం కోసం ఎవరైనా ఏదైనా చేస్తారు గానీ... ఎన్ని జన్మలెత్తినా ఇక్కడ పవర్లోకి రాం... అని స్పష్టంగా తెలిసిన తర్వాత ఎవరైనా ఏదైనా ఎందుకు చేస్తారు? కాబట్టి చేత... నువ్వు అడగాల్సింది నువ్వు ఎప్పుడూ క్రమం తప్పకుండా ఓట్లేసి గెలిపించే, మద్దతిచ్చి మోసే నీ సొంత, ఆత్మీయ పార్టీలైన తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలనే తప్ప అతిథి పాత్రలు పోషించే ఇతరుల్ని కాదు. వాగ్దానం చేసారు గదా అంటావా? హోదా ఇస్తామని చేసారా? అప్పటికి హోదా తెచ్చేశామని (పార్లమెంట్లో వెంకయ్యనాయుడి గారి వాగ్ధాటికి అప్పట్లో ప్రధాని మన్మోహన్ హోదాపై ప్రకటన చేసారు కదా) ఘనంగా చెప్పుకొని మరీ బిజెపి 2014 ఎన్నికల్లో పోటీకి దిగింది. దీన్ని కేష్ చేసుకోవడానికే తెదేపా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది. నిజానికి మన రాష్ట్రానికి ఆనాడు బిజెపి చేసిన ఉపకారం దృష్ట్యా చూస్తే ఆ పార్టీకి మనం బ్రహ్మరథం పట్టి ఉండాలి. కానీ ఏమైంది? పోటీ చేసిన స్థానాలు.. గెలిచినవి చూస్తే... మనకి బిజెపి ఎంత అక్కర్లేని పార్టీయో మనకే కాదు.. వారికీ అర్థం అవుతుంది. మనకి ఇక్కడి బాబులే ముఖ్యం కానీ బిజెపి బాబులు కాదు. సాక్షాత్తూ మోడీ పోటీ చేసినా గెలుపు గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి ఇక్కడుంది. తెదేపా ఆశీస్సులు, సహకారం ఉండబట్టే కొందరు గెలిచారు తప్ప లేకపోతే ఆ స్థానాలూ గల్లంతే అని అందరికీ తెలిసిన సంగతే. ఇలాంటి రాష్ట్రానికి బిజెపి అండగా ఎందుకు ఉంటుంది? ఇలా అడిగానని నన్ను తిట్టుకోకండి. జస్ట్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మీకే జవాబు అర్థం అవుతుంది. ఆ పార్టీపై మనకి అక్కర లేదు... ఈ రాష్ట్రంపై వారికీ అపేక్ష లేదు. రెండూ ఒక్కటే. ఇక రాజకీయాల విషయానికొస్తే.. నాలుగేళ్లపాటు బిజెపి తెదేపా పొత్తు ఉన్నది కనుక వారిద్దరి ఒడంబడికలకు లోబడే ఏవైనా జరుగుతాయి. హోదా వద్దు ప్యాకేజీ కావాలని తెదేపా అనడం.. అదే సాకుగా చూపి బిజెపి సై అనడం అందులోని భాగాలే. ఈ రాష్ట్రంలో రాజకీయం చేసే సీను బిజెపికి లేదని తెదేపా నాయకత్వానికి స్పష్టంగా తెలుసు. అందుకే ఆ బాధ్యతని తెదేపా తీసుకుంది. మొదట్నుంచీ రాజకీయంగానే వ్యవహరిస్తూ బిజెపిని తొక్కిపెట్టింది. గొప్పలన్నీ తనవిగా, తప్పులని వారివిగా విరివిగా ప్రచారం చేసింది. మనం స్వతహాగానే అదే మైండ్ సెట్ కాబట్టి అందుకు ట్యూన్ అయిపోయాం. కాబట్టి బిజెపి ఏది చెప్పిన మనకి ఎక్కదు. మనకి ఎక్కదనే సంగతి వాళ్ళకీ తెలుసు. నాలుగేళ్లు బిజెపిని కూరలో పోపులా, కరివేపాకులా వాడేసుకున్న తదనంతరం... ఎన్నికల ఏడాది వచ్చేసింది కాబట్టి అర్జంటుగా బాబు గారు మోసపోయాం అంటూ సెంటిమెంటు సీన్లకి తెర తీశారు. ఇంతకు ముందు హోదా అని అంటే తంతాం అని.. లోపల తోస్తాము అని అందరినీ బెదిరించిన ఈ పెద్ద మనిషే ఇప్పుడు హోదా కోసం కళ్లనీళ్లు పెట్టుకుంటుంటే మనం అయ్యో పాపం అని ముక్కు చీదుకుంటున్నాం! తుమ్ముకుని, ఆవులించి నారాయణ.. అనుకున్నట్టుగా ఉదయాస్తమ్ముల సంధ్యలలో నిత్యమూ బిజెపిని తిట్టుకుంటున్నాం! సమాధి చేసేస్తాం అని శాపనార్థాలు పెట్టేసి తృప్తి పడిపోతున్నాం.ఇక్కడ బిజెపిని భజన చేసినా.. బూతులు తిట్టినా రెండూ ఆ పార్టీకి ఒకటే. దేని వలనా ప్రయోజన పరితాపాలు లేవనే విషయం వారికీ విస్పష్టంగా తెలుసు కాబట్టే... ఊకలో ఈకలా మనల్ని తీసి పారేస్తున్నాడనే విషయం మనకి అర్థం కావాలి! ఈ దేశం మొత్తమ్మీద కాశ్మీర్ లో అయినా అధికారం లోకి రాగలం కానీ.. ఆంధ్రాలో రాలేము అని బిజెపి 2015 లోనే ఒక తీర్మానానికి వచ్చేసిందని వినికిడి! ఎంత చేసినా దీనివలన బిజెపికి నష్టం గానీ... మనకొచ్చే లాభం గానీ ఇసుమంత కూడా లేదనే సంగతి మనకి స్పురణకి కూడా రావడం లేదు. దానా దీనా ఏదైనా ప్రయోజనం చేకూరినా చంద్రబాబుకే తప్ప.. మనకి శూన్యమే ఒరిగేది! మొన్న బిజెపిని పొగిడి రాజకీయ లబ్ది పొందిన చంద్రబాబు ఇప్పుడు అదే బిజెపిని తిట్టి అదే రాజకీయ లబ్ది కోసం పావులు కదిపారు. అంతే తేడా!

ముఖ్యాంశాలు