ఇస్రో ఖాతాలో మరో ఘన విజయం


శ్రీహరికోటలోని సతీష్‌థావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌08 ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో మరో ఘన విజయం సాధించింది. అధునాతన ఉపగ్రహం జీశాట్‌6ఏను జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌08 వాహక నౌకద్వారా శాస్త్రవేత్తలు గురువారం సాయంత్రం 4.56 గంటలకు నింగిలోకి పంపారు. రాకెట్‌ బయలుదేరిన తర్వాత 17.46 నిమిషాల పాటు పయనించి ఉపగ్రహాన్ని పెరొజి (భూ సమీప కక్ష్య) 170 కిలోమీటర్లు, అపోజి (దూరపు కక్ష్య) 35,975 కిలోమీటర్ల ఎత్తులో వదిలిపెట్టింది. మూడు దశల్లోనూ జీఎస్‌ఎల్వీ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉపగ్రహం.. ఖమల్టీ బీమ్‌ కవరేజీ’ సౌకర్యం ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్‌ కమ్యూనికేషన్‌ను అందిస్తుంది. ఇది ఐదు స్పాట్‌ బీమ్స్‌లలో ఎస్‌బ్యాండ్‌ను, ఒక బీమ్‌లో సిబ్యాండ్‌ను కలిగి ఉంటుంది. ఉపగ్రహంలో కమ్యూనికేషన్ల సంధానత కోసం 6 మీటర్ల వ్యాసం కలిగిన "విచ్చుకునే యాంటెన్నా", హబ్‌ కమ్యూనికేషన్‌ లింక్‌ కోసం 0.8 మీటర్ల స్థిర యాంటెన్నా ఉంటాయి. ఈ ఉపగ్రహంలో విచ్చుకునే యాంటెన్నా వెడల్పు 6 మీటర్లు. జీశాట్‌6ఏ కక్ష్యలోకి చేరాక ఇది గొడుగులా విచ్చుకుంటుంది. సాధారణంగా ఇస్రో ఉపయోగించే యాంటెన్నాల కన్నా ఇది మూడు రెట్లు పెద్దది. చేతిలో ఇమిడిపోయే భూతల టెర్మినళ్ల ద్వారా ఎక్కడి నుంచైనా మొబైల్‌ కమ్యూనికేషన్లు సాగించడానికి ఇది వీలు కల్పిస్తుంది. సైనిక అవసరాలకూ ఉపకరిస్తుంది. ఇక ఎస్‌బ్యాండ్‌ అనేది విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్‌లో ఒక భాగం. ఈ బ్యాండ్‌ను వాతావరణాలకు సంబంధించిన అన్ని రాడార్లు, నౌకలు, కొన్ని కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల్లో వాడుతున్నారు. 2.5 జీహెచ్‌జెడ్‌ బ్యాండ్‌ను ప్రపంచ వ్యాప్తంగా 4జీ సేవలకు వాడుతున్నారు. అందువల్ల ఇది అత్యంత ప్రయోజనకరమైంది. మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు ఇది కీలకం. జీశాట్‌6ఏ ఉపగ్రహాన్ని మోసుకెళుతున్న జీఎస్‌ఎల్‌వీఎఫ్‌08.. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌2 శ్రేణికి చెందినది. భారత్‌ అభివృద్ధి చేసిన రాకెట్లలో రెండో అతిపెద్దది. ఆ శ్రేణి రాకెట్‌ను ప్రయోగించడం ఇది 12వ సారి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం